సినిమా చూసి.. సాఫ్ట్‌వేర్‌కు ప్రాణం పోసి..

పన్నేండేళ్ల పసిప్రాయం...  ఆలోచనలు మాత్రం అబ్బురం... ఆవిష్కరణేమో అద్భుతం!!

Published : 31 Mar 2021 00:34 IST

పన్నేండేళ్ల పసిప్రాయం...  ఆలోచనలు మాత్రం అబ్బురం... ఆవిష్కరణేమో అద్భుతం!!
ఢక్కామొక్కీలు తిన్న టెక్కీలకే కష్టమయ్యే వాయిస్‌ అసిస్టెంట్‌కు ఓ బుడత సొంతంగా ప్రాణం పోశాడు.. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

షాహిద్‌ నిహాల్‌ స్వగ్రామం కడప జిల్లా ప్రొద్దుటూరు. పన్నెండేళ్ల ఈ బాబు ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయాన్ని వృథా చేయకుండా యూట్యూబ్‌, గూగుల్‌ ద్వారానే పాఠాలు నేర్చుకుని ఓ వాయిస్‌ కమాండింగ్‌ సాఫ్ట్‌వేర్‌ తయారు చేశాడు. దీనికి ‘ఐరన్‌ మ్యాన్‌’ సినిమాలోని కల్పిత పాత్రైన ‘జార్విస్‌’ అనే పేరు పెట్టాడు.

సినిమా పాత్రతో ప్రేరేపితమై..

‘జార్విస్‌’ అనే పేరే ఎందుకంటే.. తాను ఖాళీ సమయంలో ఐరన్‌మ్యాన్‌ సినిమా చూసినప్పుడు ‘జార్విస్‌’ పాత్రకు ఆకర్షితుడనయ్యానని చెబుతున్నాడు. ఆ సినిమాలో ఈ పాత్ర అసలు కనిపించదు. కేవలం గొంతుమాత్రమే వినిపిస్తుంది. దీని స్ఫూర్తితో తాను వాయిస్‌ అసిస్టెంట్‌ను తయారు చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులైన అమ్మానాన్న సలీమ్‌, రజియాకు చెప్పాడు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం..

షాహిద్‌ చెప్పగానే.. అమ్మానాన్న మరో విషయం ఆలోచించకుండా ఓ ల్యాప్‌ట్యాప్‌ కొనిచ్చేశారు. తన బాబాయ్‌ పర్యవేక్షణలో ఈ అబ్బాయి యూట్యూబ్‌, గూగుల్‌ ద్వారా పైథాన్‌ కోర్సు సాయంతో కోడింగ్‌ రాయడం నేర్చుకున్నాడు. ఇలా కేవలం వారం రోజుల్లోనే వాయిస్‌ కమాండింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేశానంటున్నాడు షాహిద్‌. మనం చెబుతుంటేనే దీని సాయంతో కంప్యూటర్‌లో టెక్ట్స్‌ కంపోజ్‌ అవుతుందని, సిస్టంని కూడా కమాండ్‌ చేయొచ్చని చెబుతున్నాడు.

ఇబ్బంది లేకుండా.. సులువుగా..

ఎక్కువ సేపు టైపింగ్‌ చేసేవాళ్లకు ఇబ్బంది లేకుండా, మరీ ప్రత్యేకంగా అంధులకు సులువుగా అక్షరాలు రాసేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుందని వివరిస్తున్నాడీ బుడతడు. అన్నట్లు మన షాహిద్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా నడుపుతున్నాడు. ఇందులో టెక్నాలజీకి సబంధించిన విషయాలు పొందుపరుస్తున్నాడు. త్వరలో తాను ఏఐ స్పెక్ట్స్‌ కంట్రోలర్‌ కూడా రూపొందించనున్నట్లు చెబుతున్నాడు. భవిష్యత్తులో టెక్‌ ఆవిష్కర్తగా ఎదుగుతానని చెబుతున్న షాహిద్‌కు మనం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు