ఊరంతా ఈత మోత!

అనగనగా ఓ ఊరు.. ఆ ఊరిలోని పిల్లలు చేపపిల్లల్లా ఎంచక్కా ఈదేస్తారు. ఆ ఊరి మురికి చెరువే వారికి ఈతకొలను. ఈదడం అంటే ఏదో ఆడవిడుపులా కాదు..

Updated : 16 Apr 2021 01:53 IST

అనగనగా ఓ ఊరు.. ఆ ఊరిలోని పిల్లలు చేపపిల్లల్లా ఎంచక్కా ఈదేస్తారు. ఆ ఊరి మురికి చెరువే వారికి ఈతకొలను. ఈదడం అంటే ఏదో ఆడవిడుపులా కాదు.. అచ్చం ప్రొఫెషనల్స్‌లా అదరగొట్టేస్తారు. ఇంకేం సాయ్‌ దృష్టిలో పడ్డారు.. ఇంతకీ అది ఏ ఊరు? ఆ పిల్లలెవరు?తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది కదూ!
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లా కేంద్రం నుంచి 12 కి.మీల దూరంలో ఉంది పురయ్‌ గ్రామం. కొన్నాళ్ల కిందటి వరకు ఆ ఊరికి ఏ గుర్తింపూ లేదు. కానీ, ప్రస్తుతం.. ప్రతిభ గల ఈతగాళ్లున్న ఊరుగా పేరుగాంచింది. అక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఓ స్విమ్మర్‌ ఉండటం విశేషం.
మురికి చెరువే ఈత కొలను!
ఊళ్లో ఉన్న మురికి చెరువులోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తీసుకుంటున్నారు చిన్నారులు. స్విమ్మింగ్‌ను కెరీర్‌గా మలుచుకొని, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాదాపు 80 మంది బాలబాలికలు ఈ చెరువులోనే తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అబ్బుర పరుస్తున్నారు.

సాయ్‌ నుంచి పిలుపు..
విషయం తెలుసుకున్న భారత క్రీడా సమాఖ్య(సాయ్‌).. తన బృందాన్ని పురయ్‌కు పంపింది. అక్కడ చిన్నారుల ప్రతిభ చూసి అధికారులు అవాక్కయ్యారు. పిల్లల్లోంచి 12 మందిని అకాడమీలో శిక్షణ కోసమూ ఎంపిక చేశారు. అనంతరం గుజరాత్‌లోని సాయ్‌లో వాళ్లు మూడేళ్లు శిక్షణ ఇచ్చారు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అకాడమీలో ఆరేళ్లు శిక్షణ తీసుకున్న చంద్రకళ ఓజా.. తాను స్విమ్మింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న పురయ్‌ చెరువులోనే మళ్లీ ప్రాక్టీస్‌ సాగిస్తోంది. మెరుగైన వసతులు కల్పిస్తే.. భారత్‌కు ఒలింపిక్‌ స్థాయిలో పతకం సాధిస్తానని ధీమాగా చెబుతోంది.
సుదూర ప్రాంతాల నుంచీ..
క్రీడాగ్రామంగా పురయ్‌ పేరు ఫేమస్‌ కావడంతో చుట్టుపక్కల ఊళ్ల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచీ ఎంతో మంది చిన్నారులు శిక్షణ కోసం వస్తున్నారు. ఈతలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఫ్రీ స్టైల్‌, బ్యాక్‌స్ట్రోక్‌, బ్రెస్ట్‌స్ట్రోక్‌, బటర్‌ఫ్లైలో తర్ఫీదు ఇస్తున్నారు. మొత్తానికి ఇవండీ ఈతల ఊరు పురయ్‌ గురించిన విశేషాలు.

- ఈటీవీ భారత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని