ఆకాశమంత ప్రతిభ

ఆ అబ్బాయిది చిరుప్రాయం. ప్రతిభ మాత్రం ఆకాశమంత. ఫలితం.. ఏకంగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం. ఇంతకీ ఎవరీ బుడత? ఏమా.. ఘనత? తెలుసుకోవాలని ఉందా..! అయితే ఎందుకాలస్యం చదివేయండి ఈ కథనం.

Updated : 22 Jun 2021 00:41 IST

ఆ అబ్బాయిది చిరుప్రాయం. ప్రతిభ మాత్రం ఆకాశమంత. ఫలితం.. ఏకంగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం. ఇంతకీ ఎవరీ బుడత? ఏమా.. ఘనత? తెలుసుకోవాలని ఉందా..! అయితే ఎందుకాలస్యం చదివేయండి ఈ కథనం.
ఆ బుడత పేరు సోహమ్‌ సాగర్‌. వయసు 12 ఏళ్లు. ఉండేది మహారాష్ట్ర పుణె తలెగావ్‌ దభాడే. ఇక విషయమేంటంటే.. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌, స్పేస్‌ ఇండియా సంయుక్తంగా స్పేస్‌ రీసెర్చ్‌ ఛాలెంజ్‌-2021 నిర్వహించింది. ఇందులో మన సోహమ్‌ పాల్గొని తన సత్తా చాటాడు.
ఒకటి కాదు.. రెండు కాదు..
ఇంతకీ ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటారా.. వంద తేలికైన కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం. ఇవి గాల్లోని తేమ, కాలుష్యం, వాతావరణ మార్పుల గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి. అందుకని 25 నుంచి 80 గ్రాముల బరువుతో ప్రపంచంలోనే అత్యంత తేలికైన శాటిలైట్‌లను అంతరిక్షంలోకి పంపారు. అయితే ఉపగ్రహాలను రాకెట్లతో కాకుండా హీలియం బెలూన్ల సాయంతో 35 నుంచి 38 వేల మీటర్ల ఎత్తుకు పంపారు.

చరిత్ర సృష్టించి..
ఈ కార్యక్రమంలో మన సోహమ్‌ కూడా పాల్గొన్నాడు. అంతేనా అత్యంత తేలికైన ఉపగ్రహాన్ని తయారు చేసి చరిత్ర సృష్టించాడు. ఇంకేముంది ఈ అన్నయ్య వరసగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ లండన్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఇంత చిన్న వయసులోనే మన సోహమ్‌ అంత పెద్ద ఘనత సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ! మరి మనమూ అభినందనలు చెబుదామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని