చిన్ని చేతులు చేశాయో యాప్‌!

దాదాపు ఏడాదిన్నర నుంచి బడులు లేవు.. అన్నీ ఆన్‌లైన్‌ తరగతులే.. ఆటలు లేవు.. పాటలు లేవు.. స్నేహితులు లేరు.. సరదాలు అసలే లేవు.. అన్నీ ఆంక్షలే.. అడుగడుగునా కొవిడ్‌ నిబంధనలే! ఇదంతా చిన్నారులమైన మన మీద ఎంతో ప్రభావం చూపిస్తోంది. పూర్తి పరిష్కారం ...

Updated : 29 Jun 2021 01:28 IST

దాదాపు ఏడాదిన్నర నుంచి బడులు లేవు.. అన్నీ ఆన్‌లైన్‌ తరగతులే.. ఆటలు లేవు.. పాటలు లేవు.. స్నేహితులు లేరు.. సరదాలు అసలే లేవు.. అన్నీ ఆంక్షలే.. అడుగడుగునా కొవిడ్‌ నిబంధనలే! ఇదంతా చిన్నారులమైన మన మీద ఎంతో ప్రభావం చూపిస్తోంది. పూర్తి పరిష్కారం కాకపోయినా.. ఓ అక్కయ్య మన ఆటవిడుపు, పరిజ్ఞానం పెంచుకోవడం కోసం ఓ యాప్‌ తయారు చేసిందంట. ఆ విశేషాలేంటో కాసేపు అలా సరదాగా తెలుసుకుందామా!

చెన్నైకు చెందిన తనిష్కకు పన్నెండు సంవత్సరాలు. దాదాపు 18 నెలల నుంచి పాఠశాలలు లేవు. స్నేహితులూ లేరు. ఇల్లు దాటి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. దీంతో తాను ఎంతో ఒత్తిడికి గురైంది. దీని నుంచి బయటపడటం కోసం ఆన్‌లైన్‌లో స్నేహితులను పలకరిద్దామనుకుంది. కానీ పిల్లలకంటూ ప్రత్యేకంగా సోషల్‌ మీడియా వేదికలు లేవు. అందుకే తానే స్వయంగా ‘హాష్‌అప్‌’ అనే యాప్‌ను రూపొందించింది.

అదో బాలల లోకం

అయిదు నుంచి 17 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఈ యాప్‌ ద్వారా ఒకరితో ఒకరు పలకరించుకోవచ్చు. తమ ఆలోచనలు పంచుకోవచ్చు. సైన్సు సంబంధ విషయాలు, గార్డెనింగ్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌లకు సంబంధించిన విషయాలు పోస్టు చేసుకోవచ్చు. పాఠాల చిత్రాలు, వీడియోలు ఒకరితో ఒకరు షేర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ యాప్‌ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్‌ ఫోన్లలో అందుబాటులోకి రానుందట.

అమ్మానాన్న పర్యవేక్షణలోనే..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోషల్‌ మీడియా పిల్లలకు అంత సురక్షితం కాదు. కానీ తనిష్క రూపొందించిన ఈ యాప్‌లో కేవలం పిల్లలకు సంబంధించిన విషయాలే ఉంటాయి. వాళ్లకు అక్కర్లేని అంశాలు ఎవరూ పోస్టు చేయలేరు. ఒకవేళ చేసినా వెంటనే వాటిని డిలీట్‌ చేసే పక్కా వ్యవస్థతో ఈ యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్‌ ఉపయోగించాలంటే పిల్లలు తమ తల్లిదండ్రుల ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీతో మెంబర్‌షిప్‌ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లల ఆన్‌లైన్‌ విహారంపై తల్లిదండ్రుల పర్యవేక్షణకు అవకాశం ఉంది. ఈ యాప్‌ లాంచ్‌ చేయగానే.. పెద్దల కోసం కూడా మరో యాప్‌ను తయారు చేసేందుకు తనిష్క సన్నద్ధమవుతోంది. ఇంతచిన్న వయసులోనే ఈ అక్కయ్య యాప్‌ల సృష్టికర్తగా మారడం నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు