పుట్టగొడుగులోంచి లెదర్‌ పుట్టించాడు!

పుట్టగొడుగుతో ఏం చేస్తారు..? ‘ఇంకేం చేస్తాం.. చక్కగా కూర చేసుకుంటాం.. లొట్టలేసుకుంటూ తింటాం..’ అని చెబుతారేమో. కానీ ఓ అన్నయ్య మాత్రం వీటి నుంచి లెదర్‌ తయారు చేయొచ్చని చెబుతున్నాడు.

Updated : 02 Jul 2021 01:13 IST

పుట్టగొడుగుతో ఏం చేస్తారు..? ‘ఇంకేం చేస్తాం.. చక్కగా కూర చేసుకుంటాం.. లొట్టలేసుకుంటూ తింటాం..’ అని చెబుతారేమో. కానీ ఓ అన్నయ్య మాత్రం వీటి నుంచి లెదర్‌ తయారు చేయొచ్చని చెబుతున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం! ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి...

దిల్లీకి చెందిన దేవేష్‌ కుమార్‌, షాలిమర్‌ బాగ్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రతి సంవత్సరంలానే గతేడాది దిల్లీలో రాష్ట్రస్థాయి చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ -2020 పోటీలు ప్రారంభమయ్యాయి. కానీ ఇంతలో లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలల్ని మూసివేశారు. ఇంట్లోనే ఉన్న దేవేష్‌కు ఓ చక్కటి ఆలోచన వచ్చింది. దాన్ని వెంటనే అమలు చేశాడు. అదేంటంటే.. మామూలుగా మనం వాడే బ్యాగులు, షూలు, బెల్టులు, వాలెట్స్‌ ఇలా అన్నీ లెదర్‌వి అయితే బాగుంటాయి అనుకుంటాం కదా. కానీ ఈ వస్తువులన్నీ జంతువుల తోలుతోనే తయారు చేస్తారని తెలుసా? దీని కోసం ఏటా ఎన్నో జంతువులు బలి కావాల్సి వస్తోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? అదే ఆలోచించాడు దేవేష్‌. 

లెదర్‌కు ప్రత్యామ్నాయం
తన ఇంట్లోనే దేవేష్‌ కొన్ని పుట్టగొడుగులను పెంచాడు. వీటి నుంచి పెరిగే ఫంగస్‌ (మైసీలియం)తో ఇటుకలు తయారు చేశాడు. ఈ మైసీలియాన్ని లెదర్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని తన ప్రయోగం ద్వారా నిరూపించాడు. ఇందుకోసం నాలుగు వారాలు శ్రమించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ అవే పోటీలు నిర్వహించగా తన ఆలోచనను ప్రయోగాత్మకంగా చూపించాడు. మైసీలియంతో వీటిని తయారు చేస్తే, జంతువులను చంపడం తగ్గుతుందని, గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెప్పాడు.

మనకు అవగాహన లేక..
‘నేను విస్తృతమైన పరిశోధన చేశాను. తోలు పరిశ్రమలు గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలకు దారితీస్తాయని తెలుసుకున్నా. కానీ మైసీలియం వల్ల పర్యావరణానికి ఏ హానీ కలుగదు. దీనికి ఖర్చు కూడా తక్కువే అవుతుంది. భారతీయ పరిశ్రమలు జంతువుల్ని లెదర్‌ కోసం చంపడానికి బదులుగా, పుట్టగొడుగు నుంచి వచ్చే మైసీలియాన్ని వాడుకోవాలి. పాశ్చాత్య దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మనకు అవగాహన లేక ఇంకా సంప్రదాయ లెదర్‌నే వాడుతున్నాం’ అని పోటీలో తన ప్రాజెక్టు గురించి వివరించాడు. ఇంకేముంది ఇంతటి అద్భుతమైన ఆలోచనను అందరూ మెచ్చుకున్నారు. పెటా వారు జీవకారుణ్య అవార్డునూ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని