రాణీ రాణమ్మా.. నువ్వే అన్నింటికన్నా చిన్నమ్మ!

ముచ్చటైన చిన్ని రూపం.. బుజ్జి బుజ్జి కాళ్లు.. చిట్టి తోక.. తెల్లని రంగుతో చూడడానికి భలేగా కాస్త వింతగా ఉన్న ఈ ఆవు పేరు రాణి అని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదూ! మరి ఇది ఎక్కడ ఉంది? ఎప్పుడు పుట్టింది? ఇలాంటి వివరాలు తెలుసుకుందామా..!!

Published : 20 Jul 2021 01:45 IST

ముచ్చటైన చిన్ని రూపం.. బుజ్జి బుజ్జి కాళ్లు.. చిట్టి తోక.. తెల్లని రంగుతో చూడడానికి భలేగా కాస్త వింతగా ఉన్న ఈ ఆవు పేరు రాణి అని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదూ! మరి ఇది ఎక్కడ ఉంది? ఎప్పుడు పుట్టింది? ఇలాంటి వివరాలు తెలుసుకుందామా..!!

ఆవు బంగ్లాదేశ్‌లోని మాణిక్‌గంజ్‌లో 2019లో పుట్టింది. దీని వయసు ఒక సంవత్సరం 11 నెలలు. బరువు 26 కిలోలు. ఎత్తు కేవలం 69 సెంటీమీటర్లు, వెడల్పు 51 సెంటీమీటర్లు. ప్రస్తుతానికైతే ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న ఆవు. కానీ దీనికి ఇంకా అధికారికంగా ఆ హోదా దక్కలేదు. ఇప్పటికైతే ఆ రికార్డు కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు పేరిట ఉంది. కానీ ఈ రాణి, మాణిక్యం కన్నా నాలుగు అంగుళాలు చిన్న.

మరి కొన్ని రోజుల్లో...

ఖాజీ మహమ్మద్‌ అబు సుఫయాన్‌.. ఈయన ఈ రాణి అనే ఆవు యజమాని. ఆయన దీన్ని ప్రపంచంలోనే చిన్న ఆవు అని గుర్తించాడు. ఈ మేరకు గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారికి దరఖాస్తు చేసుకున్నాడు. మరి కొన్ని రోజుల్లోనే మన రాణికి ప్రపంచంలోనే అతిచిన్న ఆవుగా గుర్తింపు రానుంది.

సెలబ్రిటీ అయిపోయింది..

ప్రస్తుతం మన రాణి సెలబ్రిటీ అయిపోయింది. దీని వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. దీన్ని నేరుగా చూసేందుకు కూడా జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అది దీని యజమానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. జనాన్ని నియంత్రించడానికి ఆయన ఏకంగా ముగ్గురు భద్రతా సిబ్బందిని నియమించుకోవాల్సి వచ్చింది. ‘అసలే కరోనా కాలం.. జనం ఇలా మూగితే ఎంతో ప్రమాదం. నా చిట్టి రాణికి కూడా ఏమైనా జరగొచ్చు. అందుకే ఊరికే మూకుమ్మడిగా ఎవరూ రాకండి’ అని ఖాజీ మహమ్మద్‌ జనాలను అభ్యర్థిస్తున్నారు. రోజుకు కేవలం పదిమందికి మాత్రమే తన రాణిని చూసేందుకు ఆయన అనుమతి ఇస్తున్నారు. జన్యులోపంతో జన్మించిన ఈ చిన్ని ఆవుకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని, తేలిగ్గా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దాన్ని బుజ్జిపాపాయిలా కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. రాణి ఎప్పుడూ చక్కని ఆరోగ్యంతో ఉండాలని, త్వరలోనే దాని పేరు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదు కావాలని మనమూ కోరుకుందామా! ప్రస్తుతానికైతే రాణికి బై..బై.. చెప్పేద్దామా మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని