ఈ మాస్క్‌.. కరోనా పాలిట యమరాజు!

నేస్తాలూ..! రెండు సంవత్సరాలకు ముందు ప్రపంచం.. ముఖ్యంగా మన పిల్లల ప్రపంచం ఎంత బాగుండేది! పార్కులు, ఎగ్జిబిషన్లు, సర్కస్‌లు, ఆటలు, పాటలు, ఎంచక్కా బడిలో చదువులు.. ఇలా రంగులమయంగా ఉండేది.

Updated : 13 Aug 2021 00:56 IST

నేస్తాలూ..! రెండు సంవత్సరాలకు ముందు ప్రపంచం.. ముఖ్యంగా మన పిల్లల ప్రపంచం ఎంత బాగుండేది! పార్కులు, ఎగ్జిబిషన్లు, సర్కస్‌లు, ఆటలు, పాటలు, ఎంచక్కా బడిలో చదువులు.. ఇలా రంగులమయంగా ఉండేది. కానీ ఇప్పుడు అడుగడుగునా అన్నీ ఆంక్షలే. కారణం కరోనా. ఎక్కడికీ వెళ్లడానికి లేదు. చదువులేమో ఆన్‌లైన్‌లో.. ఎంతో బాధాకరం కదూ! ‘మనం చిన్నారులం. మనం ఏం చేయగలం’ అని చాలాసార్లు అనుకునే ఉంటారు. కానీ ఓ అక్కయ్య మాత్రం కరోనా అంతు చూడాలనుకుంది. దాని కోసం ఏకంగా ఓ ఆవిష్కరణ చేసింది. అదేంటంటే..

శ్చిమబంగకు చెందిన దిగంతిక బోస్‌ ఓ మాస్క్‌ను కనిపెట్టింది. ‘మాస్క్‌ను ఆమె కనిపెట్టడం ఏంటి? ఎప్పటి నుంచో ఉన్నదే కదా..!’ అనాలనుకుంటున్నారు కదూ! కాస్త ఆగండి మీకే తెలుస్తుంది. ఈ మాస్క్‌ మామూలు మాస్క్‌ కాదు.. కరోనా నుంచి రక్షణ ఇవ్వడమే కాదు.. ఏకంగా కరోనా వైరస్‌నే నాశనం చేసేయగలదు మరి!

మూడు పొరల్లో..

ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న ఈ అక్కయ్య తయారు చేసిన మాస్క్‌ ‘మ్యూజియమ్‌ ఆఫ్‌ డిజైన్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ముంబై’లో ప్రదర్శితమైంది కూడా! ఇంతకీ ఈ మాస్క్‌ గొప్పదనం ఏంటంటే.. దిగంతిక తయారు చేసిన మాస్క్‌కు మూడు పొరలుంటాయి. మొదటిది గాలిలోని దుమ్ముకణాలను అడ్డుకుంటుంది. ఇలా ఫిల్టర్‌ అయిన గాలి రెండో పొరను చేరుకుంటుంది. అక్కడ మరికాస్త ఫిల్టర్‌ అవుతుంది. చివరగా మూడో పొరను చేరుకుంటుంది. అసలు కిటుకంతా ఈ మూడో పొరలోనే ఉంది.

మూడో పొరలో ఏముందంటే..

ఇలా రెండు పొరల ద్వారా వచ్చిన గాలి మూడో పొరలో కరోనా రహితంగా మారుతుంది. ఎలా అంటే ఇక్కడ సబ్బు ద్రావణం ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది సబ్బు కరోనాను చంపేస్తుంది అని. అందుకే దిగంతిక తాను తయారు చేసిన మాస్కులో సబ్బు ద్రావణాన్ని వాడింది. ఫలితంగా గాల్లో ఉన్న కరోనా వైరస్‌ ముక్కు ద్వారా మనల్ని చేరలేదు.

కరోనా రోగులూ వాడాలి..

ఈ మాస్కు ఎలా అయితే వాతావరణంలో ఉన్న కరోనా వైరస్‌ మన ఊపిరితిత్తుల్లోకి చేరకుండా అడ్డుకుంటుందో అలాగే.. కరోనా రోగి నుంచి వైరస్‌ గాల్లోకి విడుదల కాకుండా కూడా అడ్డుకట్ట వేస్తుంది. మొత్తానికి దిగంతికది భలే ఆలోచన, భలే ఆచరణ కదూ. తాను తయారు చేసిన ఈ మోడల్‌ మాస్క్‌ను వాణిజ్యపరంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తే కేవలం మూడువందలకే దొరుకుతుందని చెబుతోంది ఈ అక్కయ్య. అన్నట్లు ఈమె గతంలోనూ ఎన్నో ఆవిష్కరణలు చేసి ప్రముఖుల నుంచి ప్రశంసలూ అందుకుంది. ఎంతైనా దింగతిక చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని