నాన్నా.. నన్ను ఆశీర్వదించవూ!

బుడిబుడి అడుగులు వేసే వయసున్నప్పటి నుంచి ఆ చిన్నారికి వాళ్ల నాన్నతో అనుబంధం ఉంది. కానీ పాడు కొవిడ్‌ వాళ్ల నాన్నను తన నుంచి దూరం చేసింది. అయినా ఆ చిన్నారి వాళ్ల తండ్రి జ్ఞాపకాలను మరువలేదు. అంత చిన్న వయసులోనే

Updated : 05 Sep 2021 00:33 IST

బుడిబుడి అడుగులు వేసే వయసున్నప్పటి నుంచి ఆ చిన్నారికి వాళ్ల నాన్నతో అనుబంధం ఉంది. కానీ పాడు కొవిడ్‌ వాళ్ల నాన్నను తన నుంచి దూరం చేసింది. అయినా ఆ చిన్నారి వాళ్ల తండ్రి జ్ఞాపకాలను మరువలేదు. అంత చిన్న వయసులోనే వాళ్ల నాన్న మీద తనకున్న గొప్ప ప్రేమను చాటుకుంది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసిందంటే..

ర్ణాటక రాష్ట్రం కోప్పల్‌ జిల్లాకు చెందిన స్పందనకు ఎనిమిది సంవత్సరాలు. మే 13 వాళ్ల నాన్న మహేష్‌ కోసంగర్‌ కరోనాతో మృతి చెందారు. బుధవారం స్పందన పుట్టినరోజు. ప్రతీసారి నాన్న సమక్షంలో ఘనంగా తన బర్త్‌డే వేడుకలు జరిగేవి. కానీ ఈ సారి నాన్న లేకుండా పుట్టినరోజు చేసుకోవాలంటే ఆ చిన్నారికి ఏదో తెలియని వెలితిగా అనిపించింది. వెంటనే తనకో ఆలోచన తట్టింది. అంతలోనే అమ్మ ఏమైనా అనుకుంటుందేమో అని తటపటాయించింది. తన మనసులోమాటను వాళ్ల అమ్మకు చెప్పింది.

అమ్మను ఒప్పించి..

‘అమ్మా ఈసారి నా బర్త్‌డే నాన్న సమాధి దగ్గర చేసుకుంటా. ఈ సారే కాదు. ప్రతిసారీ నా పుట్టినరోజు వేడుకలు అక్కడే చేసుకుంటా’ అని అడిగింది. ముందు వాళ్ల అమ్మ రూప కాస్త అవాక్కైంది. కానీ నాన్న మీద తన కూతురుకున్న ప్రేమకు ముగ్ధురాలైంది. ఇంట్లోవాళ్లను, సమీప బంధువులను ఒప్పించి స్పందనతో బర్త్‌డే కేక్‌ను సమాధి దగ్గరే కోయించింది. స్థానికులు ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నారు. స్పందనకు నాన్నమీద ఉన్న ప్రేమను మెచ్చుకున్నారు.

‘నా చుట్టూనే ఉన్నట్లుంది’

నీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందని ఎవరైనా అడిగితే... ‘నాన్న చనిపోయారు అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆయన ఇంకా మా మధ్యే ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే ఆయన సమాధి దగ్గర నా బర్త్‌డే కేక్‌ కట్‌ చేశా. ఆయన నన్ను ఆశీర్వదించినట్లు కూడా అనిపించింది’ అని ముద్దుముద్దుగా చెబుతోంది మన స్పందన. మరి మనమూ ఈ చిన్నారికి ‘బి లేటెడ్‌ బర్త్‌డే విషెస్‌’ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని