వినూత్న పోటీలో విజేతలయ్యారు!

కాసేపు ఆ ఫోన్‌ పక్కన పెట్టి చదువుకోవచ్చుగా.. అని అమ్మ అంటున్నా ఊహు.. వింటామా! ఫోన్‌ లాక్కుంటే టీవీకి అతుక్కుపోతాం. అంతలా ఊహ వచ్చిన దగ్గర్నుంచి డిజిటల్‌ ప్రపంచానికి అలవాటు పడిపోయాం.

Updated : 07 Oct 2021 01:15 IST

కాసేపు ఆ ఫోన్‌ పక్కన పెట్టి చదువుకోవచ్చుగా.. అని అమ్మ అంటున్నా ఊహు.. వింటామా! ఫోన్‌ లాక్కుంటే టీవీకి అతుక్కుపోతాం. అంతలా ఊహ వచ్చిన దగ్గర్నుంచి డిజిటల్‌ ప్రపంచానికి అలవాటు పడిపోయాం. ఒక్కసారిగా ఎలా కంట్రోల్‌ అవుతాం అంటున్నారా! అయితే ఒక్కసారి ఈ ధైర్యపరిఖ్‌, నిష్ఖా పరిఖ్‌ని అడిగి చూడండి. తాము గాడ్జెట్స్‌కు దూరంగా ఉంటూ ఓ పోటీలో విజేతలుగా నిలిచారు. ఎలాగబ్బా? అదేం పోటీ? ఎవరీ నేస్తాలు..? ఆ వివరాలన్నీ తెలుసుకుందామా!

రోజుల్లో ప్రతి పనికీ ఫోన్‌ అవసరం ఎక్కువయింది. ఆన్‌లైన్‌ క్లాసులు వినాలన్నా, గేమ్స్‌ ఆడాలన్నా, కామిక్స్‌ చూడాలన్నా అందులోనే! మన సంగతి పక్కన పెడితే పెద్దవాళ్లకు డిజిటల్‌ ప్రపంచమే లోకమైపోయింది. ప్రతిదానికీ దానిమీదనే ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. ఇది దృష్టిలో పెట్టుకుని బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న పోటీని పెట్టింది. డిజిటల్‌ సేవలను ఉపయోగించకుండా కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపరచడం వీళ్ల ఉద్దేశమట.

వయసుతో సంబంధం లేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారంతా ఈ పోటీలో పాల్గొనవచ్చు. పోటీ పేరు ‘డిజిటల్‌ ఫాస్టింగ్‌’. అంటే ఇందులో పాల్గొనేవాళ్లు 50 రోజుల పాటు డిజిటల్‌కు సంబంధించిన ఎటువంటి గాడ్జెట్లను ఉపయోగించకూడదు. అలా ఎవరు ఉంటారో వాళ్లు విజేతలు అన్నమాట.

నిబద్ధతతో సాధించారు.. ఇందులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల మంది పాల్గొన్నారు. అందులో గుజరాత్‌కు చెందిన అయిదుగురు.. విజేతలుగా నిలిచారు. వాళ్లలో ముగ్గురు పెద్దవాళ్లు ఉండగా, మరో ఇద్దరు చిన్నారులున్నారు. వాళ్లే పదేళ్ల ధైర్యపరిఖ్‌. తను మొదటి స్థానంలో నిలిస్తే, వాళ్లక్క 14 ఏళ్ల నిష్ఖాపరిఖ్‌ మూడోస్థానంలో నిలిచింది. అన్నట్టు వీళ్లిద్దరూ పోటీలో పాల్గొన్నప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులను వినకూడదు కదా! అందుకేం చేశారో తెలుసా! వాళ్ల స్నేహితుల ఇంటికి వెళ్లి ఏరోజు చెప్పిన పాఠం ఆరోజు తెలుసుకుని మరీ చదువుకున్నారు. చదువునీ వదల్లేదు. పోటీలోనూ తప్పుకోలేదు. అంత ఇబ్బంది పడుతూ పోటీలో పాల్గొనాల్సిన అవసరమేముంది అని అడిగితే ఈ చిన్నారులు ఏం చెప్పారో తెలుసా! ఏ పని చేసినా నిబద్ధతతో చేయాలని అప్పుడే అనుకున్నది సాధించవచ్చని మా అమ్మానాన్నలు చెప్పారని గర్వంగా చెబుతున్నారు. చూశారుగా చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఉండాలనేది వీళ్లను చూసి నేర్చుకోవచ్చు కదా! మరింకేం వాళ్లిద్దరికీ అభినందనలు తెలిపేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని