బుల్లి విలేకరి.. భలే గడసరి

ఎవరైనా ప్రముఖులు మన ఇంటి వైపు వస్తున్నారంటే మనమేం చేస్తాం.. ఏముంది దగ్గరైతే చూడ్డానికి వెళతాం. లేదంటే చూసీ చూడనట్లు వదిలేస్తాం.

Updated : 09 Oct 2021 00:46 IST

ఎవరైనా ప్రముఖులు మన ఇంటి వైపు వస్తున్నారంటే మనమేం చేస్తాం.. ఏముంది దగ్గరైతే చూడ్డానికి వెళతాం. లేదంటే చూసీ చూడనట్లు వదిలేస్తాం. కానీ ఓ బుడతడు అప్పటికప్పుడు రిపోర్టర్‌ అవతారం ఎత్తాడు. తన తెలివితో ముఖ్యమంత్రినే మెప్పించేశాడు. ఆ సంగతేంటో మీరే చదివి తెలుసుకోండి..

ణిపుర్‌ రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవం జరుగుతోంది. దానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకున్న ఏడేళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్‌ పైకి ఎక్కి చూశాడు. చూడటంతోనే ఊరుకుంటే ఇప్పుడు వార్తల్లోకి వచ్చేవాడు కాదేమో. వెంటనే ఫోన్‌లో సెల్ఫీ వీడియో ఆన్‌ చేసి.. ముఖ్యమంత్రి ఇక్కడకు విచ్చేశారనీ, ప్లాంట్‌ ప్రారంభోత్సవం జరుగుతుందనీ తన స్టయిల్‌లో టీవీ రిపోర్టర్‌లా గడగడా చెప్పాడు. అది కూడా 2నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడి అందరూ ఆశ్చర్యపోయే విధంగా వీడియో చేశాడు. ఆ తర్వాత దాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌ అయ్యి ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ వరకూ వెళ్లింది. ఆయన అవాక్కయ్యారు. అంతేకాదు ఆశ్చర్యంతో ట్విట్టర్‌లో ఆ పిల్లాడి గురించి ప్రస్తావించారు. ఆ బుడ్డోడు తీసిన వీడియోను జతచేసి ‘సేనాపతిలో నా ఫ్రెండ్‌ ఉన్నాడు. నేను వచ్చిన సంగతి రిపోర్టింగ్‌ ఇచ్చాడు. అతన్ని మీరు కలవొచ్చు’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఈ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. అంతే! నెటిజన్లు అంతా ఈ బుల్లి విలేకరిని ప్రశంసలతో ముంచెత్తు తున్నారు. అయితే అతడి వివరాలేమీ ఇంకా తెలియలేదు. కానీ ఒక్కరోజులో తన తెలివితో ఫేమస్‌ అయిపోయాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని