పాపం.. పక్షులు సార్‌!

మైసూరు అనగానే మనకు దసరా ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. అక్కడ అంత ఘనంగా జరుగుతాయి మరి. విద్యుద్దీపకాంతుల్లో.. రంగరంగవైభవంగా వేడుకలు జరుగుతాయి. కానీ ఓ చిన్నారి మాత్రం చెట్లు, పక్షుల గురించి కూడా కాస్త ఆలోచించమంటోంది.

Published : 12 Oct 2021 01:03 IST

మైసూరు అనగానే మనకు దసరా ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. అక్కడ అంత ఘనంగా జరుగుతాయి మరి. విద్యుద్దీపకాంతుల్లో.. రంగరంగవైభవంగా వేడుకలు జరుగుతాయి. కానీ ఓ చిన్నారి మాత్రం చెట్లు, పక్షుల గురించి కూడా కాస్త ఆలోచించమంటోంది. వాటిని దృష్టిలో పెట్టుకుని వాటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకోమంటోంది. ఇంతకీ చిన్నారి ఎవరు? ఏం చెబుతోందంటే..

మైసూరుకు చెందిన పి.ఛార్వి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. దసరా వేడుకల సందర్భంగా మైసూరు మొత్తం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగురంగుల విద్యుత్తు దీపాల అలంకరణ కోసం చెట్లకు వందలకొద్దీ మేకులను కొడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చెట్లు చనిపోయే అవకాశముందని ఈ చిన్నారి తల్లడిల్లుతోంది. అంతే కాకుండా ఈ చెట్ల మీద గూళ్లు కట్టుకుని గుడ్లుపెట్టుకున్న పక్షులు ఈ దీపాల వెలుగులకు తీవ్ర ఇబ్బందులు పడతాయంటోంది. పండగ ఘనంగా చేసుకోవాలి.. కానీ పక్షులు, చెట్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలంటోంది.

లేఖలూ రాసింది..

ఇదే విషయమై డిప్యూటీ కమిషనర్‌, డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ వారికి తన చిట్టిచేతులతో లేఖలూ రాసింది. పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా పండగ నిర్వహించుకునేలా పర్యవేక్షించాలని వాళ్లకు సూచించింది. ఇంత చిన్న వయసులోనే ఇంత పర్యావరణ స్పృహ ఈ చిన్నారిలో ఎలా వచ్చిందని అధికారులూ ఆశ్చర్యపోయారు.

నాన్న స్ఫూర్తితో...

ఛార్వి వాళ్ల నాన్న ఓ పాముల సంరక్షకుడు. ఎవరి ఇళ్లలోకైనా పాములు చొరబడితే వాటిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేస్తుంటారు ఆయన. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపనీయరు. వాటివల్ల పర్యావరణానికి ఎంతో మేలని చెబుతుంటారు. ఈ ప్రకృతిలో ప్రతి జీవికీ జీవించే హక్కుందని.. వాటిని గౌరవిస్తూ, ఆ జీవులకు ఇబ్బంది కలిగించకుండా మనుషులు బతకడం నేర్చుకోవాలని చెబుతుంటారు ఆయన. ఇవన్నీ ఛార్వి మీద ప్రభావం చూపి ఆమెకు చెట్లు, పక్షులంటే ఇష్టం ఏర్పడేలా చేసింది. అదే నేడు ఇలా అధికారులకు లేఖలు రాసేలా చేసింది. మరి మన ఛార్వి ఆశయం నెరవేరాలని.. చెట్లు, జీవులకు ఇబ్బంది కలిగించకుండానే మైసూరు దసరా వేడుకలు అంగరంగవైభవంగా జరగాలని మనమూ కోరుకుందామా ఫ్రెండ్స్‌!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని