ఈ చిన్నారి.. వేగంలో చిరుత!

ఓ నేస్తం పరుగుపందెంలో సత్తా చాటుతోంది. సరదాగా మొదలు పెట్టిన పరుగు.. నేడు ప్రపంచ రికార్డ్‌ అందుకునేలా చేసింది. ఇంతకీ ఆ నేస్తమెవరో.. ఏంటో తెలుసుకునేందుకు చదివేయండి.

Updated : 03 Nov 2021 04:55 IST

ఓ నేస్తం పరుగుపందెంలో సత్తా చాటుతోంది. సరదాగా మొదలు పెట్టిన పరుగు.. నేడు ప్రపంచ రికార్డ్‌ అందుకునేలా చేసింది. ఇంతకీ ఆ నేస్తమెవరో.. ఏంటో తెలుసుకునేందుకు చదివేయండి.

ఆ నేస్తం పేరు మెక్‌ గీ. వయసు 12 ఏళ్లు. స్వస్థలం ఉత్తర ఐర్లాండ్‌ రాజధాని బెల్ఫాస్ట్‌. మెక్‌ గీ తనకు తొమ్మిదేళ్లప్పుడు సరదాగా కుటుంబంతో కలిసి ఇంటి ముందున్న పార్కుకి వాకింగ్‌కి వెళ్లేది. రోజూ వాకింగ్‌ చేయడంతో పాటు పరుగు కూడా తీసేది. అలా మెక్‌ గీకి రన్నింగ్‌ మీద ఇష్టం ఏర్పడింది. తన ఆసక్తిని గమనించిన అమ్మానాన్న దగ్గర్లో ఉన్న రన్నింగ్‌ క్లబ్‌లో చేర్పించారు. అప్పట్నుంచి రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించింది. అటు చదువుకుంటూనే ఇటు రన్నింగ్‌ మీద దృష్టిపెట్టింది.

లక్ష్య సాధనలో.. 

పరుగులో శిక్షణ తీసుకుంటూ.. పరుగు పందెం పోటీల్లో పాల్గొనేది. ఏ పోటీలో పాల్గొన్నా తనే ముందుండేది. అలా 11 ఏళ్ల వయసు వచ్చాక మెక్‌ గీ.. ‘పరుగులో ప్రపంచ రికార్డు సాధించాలి’ అని లక్ష్యాన్ని పెట్టుకుంది. అదే లక్ష్యంతో సాధన మొదలుపెట్టింది. పొద్దునే లేచి... ఇంత దూరం పరిగెత్తాలి అని సమయం పెట్టుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకునేది. ఇందుకు అమ్మానాన్న ఎంతగానో సహకరించారు. వాళ్ల ప్రోత్సాహంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర ఐర్లాండ్‌లో జరిగిన 5కి.మీ. రన్నింగ్‌ రేస్‌లో పాల్గొంది. తన పరుగు వేగం చూసి న్యాయ నిర్ణేతలే అవాక్కయ్యారు. కేవలం 16 నిమిషాల 27 సెకన్లలో 5కి.మీ. పరిగెత్తి తను అనుకున్న ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. చూశారుగా.. ఏదైనా అనుకుంటే సాధించేవరకూ శ్రమించాలి అని ఈ నేస్తాన్ని చూస్తే అర్థమవుతుంది కదా! మరి మీరూ నేస్తాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఆల్‌ ద బెస్ట్‌..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని