Updated : 07 Dec 2021 13:51 IST

చేతులు లేకున్నా.. ఒంటరి పోరాటం!

పుట్టుకతోనే రెండు చేతులు పూర్తిగా లేని ఓ చిన్నారి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఎంపికయ్యాడు. ముగ్గురు ఫైనలిస్టుల్లో ఒకడిగా నిలిచాడు. అదెలాగబ్బా అనుకుంటున్నారా? దీని వెనుక చిన్నారి కష్టం, అలుపెరుగని పోరాటం చాలానే ఉంది. ఇంతకీ అతనెవరు? ఏం చేశాడంటే..

కేరళలోని కోజికోడ్‌కు చెందిన మహ్మద్‌ ఆసిం వయసు ప్రస్తుతం 15 ఏళ్లు. ఈ చిన్నారికి పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. అయినా సరే ఏ మాత్రం నిరాశ చెందకుండా చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు అమ్మానాన్న. చేతితో రాయలేడు కాబట్టి తనకు తానే కాలితో రాయడం నేర్చుకున్నాడు.

ముఖ్యమంత్రికే లేఖ రాశాడు..
తన ఇంటికి దగ్గర్లోనే స్కూలు ఉండడంతో ఇబ్బంది లేకుండానే చదువుకున్నాడు. కానీ అది కేవలం ప్రాథమిక పాఠశాల మాత్రమే. పై తరగతులకు వెళ్లడానికి ఇబ్బందైంది. దీంతో మన ఆసిం అప్పటి ముఖ్యమంత్రికి ఈ విషయమై లేఖ రాశాడు. సీఎం వెంటనే స్పందించి ఆ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా మారుస్తూ 2014లో ఆజ్ఞలు జారీ చేశారు. దీంతో ఆసిం ఏ ఇబ్బందీ లేకుండా చదువుకున్నాడు.

మళ్లీ అదే సమస్య
కానీ 2018లో ఎప్పుడైతే ఈ చిన్నారి ఏడో తరగతికి వచ్చాడో అప్పుడు పాత సమస్యే పునరావృతం అయింది. ఈ సారి మళ్లీ ముఖ్యమంత్రికి ఆసిం లేఖ రాశాడు. అందులో తన ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. ఈసారి పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ చేయమని కోరాడు. ఎన్ని సార్లు లేఖలు రాసినా అటువైపు నుంచి స్పందన రాకపోయేసరికి.. ఏకంగా కేరళ హైకోర్టులో పిటీషన్‌ వేశాడు.

రెండేళ్లుగా ఇంటి నుంచే..  
రెండేళ్లుగా ఆసిం ఇంటినుంచే తన చదువులను కొనసాగిస్తున్నాడు. మరో స్కూలులో చేరనేలేదు. కోర్టు తీర్పు తనకు, తనలాంటి దివ్యాంగులకు అనుకూలంగా వస్తుందని ఎదురు చూస్తున్నాడు. తనకు రెండు చేతులు లేకున్నా.. ఇంత పోరాట పటిమ ప్రదర్శిస్తున్నాడు కాబట్టే.. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ రైట్‌ ఆర్గనైజేషన్‌’ ఆధ్వర్యంలో నడుస్తున్న కిడ్స్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ వారు అంతర్జాతీయ బాలల శాంతి బహుమతికి ఎంపిక చేశారు. ఈ నెల 13వ తేదీన నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి చేతుల మీదుగా ఈ చిన్నారి అవార్డు అందుకోబోతున్నాడు. నిజంగా ఆసిం గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు