వేళ్లలోనే మాయ..వేగంగా.. సరిగమ సాగంగా!

ఓ పదిహేనేళ్ల చిన్నారి.. పియానో వాయిస్తుంటే.. చూసిన వారికి అసలు అవి చేతివేళ్లేనా అనే అనుమానం రాకమానదు. అవి అంత వేగంగా కదులుతాయి మరి..! కేవలం వేగంగా కదలడం మాత్రమే కాదు

Updated : 28 Nov 2021 00:45 IST


ఓ పదిహేనేళ్ల చిన్నారి.. పియానో వాయిస్తుంటే.. చూసిన వారికి అసలు అవి చేతివేళ్లేనా అనే అనుమానం రాకమానదు. అవి అంత వేగంగా కదులుతాయి మరి..! కేవలం వేగంగా కదలడం మాత్రమే కాదు.. ఆ చేతి వేళ్ల వల్ల పియానోలోంచి వచ్చే శ్రావ్యమైన శబ్దాలు వింటే అలల్లో అలా.. అలా.. తేలిపోతున్నట్లే ఉంటుంది.
లిదియన్‌ నాదస్వరం.. స్వస్థలం చెన్నై. ఈ పిల్లాడి పేరులోనే సంగీత వాయిద్యం ఉంది కదూ! దాన్ని సార్థకం చేసుకుంటూ పియానో మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తన పదమూడో ఏటనే ‘ద వరల్డ్‌ బెస్ట్‌’ గ్లోబల్‌ టాలెంట్‌ కాంటెస్ట్‌లో పాల్గొని దాదాపు 6 కోట్ల రూపాయల ప్రైజ్‌ మనీని పొందాడు.

అమ్మో.. ఎంత వేగమో!
మన లిదియన్‌కు చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఇష్టం. నాలుగేళ్లు ‘ఎ.ఆర్‌.రెహమాన్స్‌ కేఎమ్‌ మ్యూజిక్‌ కంజర్వేటరీ’లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం లిదియన్‌ వాళ్ల నాన్న దగ్గర తర్ఫీదు పొందుతున్నాడు. అన్నట్లు వాళ్ల నాన్న వర్షన్‌ సతీష్‌కు కూడా సంగీతం మీద పట్టుంది. ‘ద వరల్డ్‌ బెస్ట్‌’ గ్లోబల్‌ టాలెంట్‌ కాంటెస్ట్‌లో పాల్గొన్నప్పుడు నిమిషానికి 280 బీట్స్‌ వాయించాడు. ఇప్పుడు అది 325 బీట్స్‌కు పెరిగింది.

ఒకేసారి రెండు పియానోలు..
లిదియన్‌.. కళ్లకు గంతలు కట్టుకొని కూడా పియానో వాయించగలడు. ఒకేసారి రెండు పియానోల మీద కూడా సంగీతాన్ని పలికించగలడు. ఎ.ఆర్‌.రెహమన్‌ నుంచి కూడా ఈ బుడతడు ప్రశంసలు అందుకున్నాడు. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ లిదియన్‌ పేరు నమోదై ఉంది. ఇప్పటికీ రోజుకు ఆరుగంటలు పియానో మీద కసరత్తులు చేస్తూనే ఉన్నాడు. భవిష్యత్తులో హాలీవుడ్‌ కోసం మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడమే తన ఆశయం అని చెబుతున్నాడు లిదియన్‌. అంతే కాదు నేస్తాలూ..! వీలైతే చంద్రుడి మీద పియానో కూడా వాయిస్తా అంటున్నాడు. చిన్న వయసులోనే ఇంత ఘనత సొంతం చేసుకున్న మన లిదియన్‌ నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని