Published : 05 Dec 2021 01:48 IST

వైకల్యాన్ని జయించాడు

ఖాళీగా ఉన్నామంటే స్నేహితులతో కలిసి ఊరంతా చుట్టేసి రావాల్సిందే! కాసేపు కుదురుగా కూర్చోమంటే  వింటామా! ఊహు.. అలాంటిది అసలు ఎప్పుడూ కదలకుండా ఉండమంటే వామ్మో కష్టం కదా! ఓ చిన్నారికి అలాంటి కష్టమే వచ్చింది. శరీరమంతా కదల్లేని స్థితి. అయినా ఆ చిన్నారి కుంగిపోలేదు. తన ప్రతిభను వెలికితీసి అందులో ఆనందం వెతుక్కుంటున్నాడు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతనెవరు? తన కథేంటో చూద్దాం రండి..

ఆ చిన్నారి పేరు అయాన్‌ జరీవాలా. వయసు 11 ఏళ్లు. ఉండేది అహ్మదాబాద్‌లో. ప్రస్తుతం అయాన్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. అమ్మానాన్న సంధ్య, జుబేర్‌ జరీవాలా.

నాలుగేళ్లకి నిజం తెలిసింది..

అయాన్‌ చిన్నప్పట్నుంచి ‘డుచెన్‌ మస్కులర్‌ డిస్ట్రోఫీ’ అనే జన్యుపరమైన జబ్బుతో బాధపడుతున్నాడు. అంటే అతని శరీరం దిగువ భాగం పనిచేయదు అన్నమాట. తనకు ఆ జబ్బు ఉందని మొదట అయాన్‌ అమ్మానాన్నకు తెలియలేదు. కానీ అయాన్‌కు నాలుగేళ్లు వచ్చాక ‘ఎప్పుడూ కూర్చునే ఉంటున్నాడేంటి నడవట్లేదు’ అని వాళ్లకి అనుమానం వచ్చింది. వెంటనే వైద్యుణ్ని సంప్రదిస్తే అయాన్‌కున్న వ్యాధి బయటపడింది. అప్పట్నుంచీ అయాన్‌ను కంటికి రెప్పలా కాపడుతూ వచ్చారు. నడవలేడు కాబట్టి ఎక్కడికి వెళ్లినా వీల్‌చైర్‌తోనే. ఇక స్నానం చేయడం, పళ్లు తోమడం లాంటి వాటికి వేరొకరి సాయం కావాలి. కానీ అయాన్‌ చేతులు మోచేతుల వరకు పనిచేస్తాయి. రాయగలడు, చదవగలడు అందుకే బడిలో చేర్పించారు అమ్మానాన్న.

సానుభూతి నచ్చదు..

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రతిభ ఉన్నట్టే అయాన్‌కు చిత్రలేఖనంలో అద్భుతమైన ప్రతిభ ఉంది. బొమ్మలను చక్కగా గీస్తాడు. అలా తనకు తానుగా 59 చిత్రాలను గీశాడు. అవి చూసిన అయాన్‌ తల్లితండ్రులు మురిసిపోయారు. అయాన్‌ బలహీనత అందరికీ తెలుసు కానీ బలమేంటో నలుగురికీ తెలియజెప్పాలి అనుకున్నారు. వెంటనే ఈ నెల 4, 5 తేదీల్లో షాహీబాగ్‌లోని కస్తూర్‌భాయ్‌ లాల్‌భాయ్‌ గ్యాలరీలో తన బొమ్మలతో ఆర్డ్‌ ఎగ్జిబిషన్‌ పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు స్నేహితులు, ఉపాధ్యాయులు కూడా తోడయ్యారు. అన్నట్టు అయాన్‌కు ఎవరైనా సానుభూతి చూపిస్తే నచ్చదు. అదేమనంటే ‘ప్రపంచంలో అందరికీ సమస్యలుంటాయి. నాకు ఉన్న సమస్య చాలా చిన్నది. నాకంటే పెద్ద సమస్యలున్నవారు ఉన్నారు. వాళ్లంతా జీవితాన్ని గెలవట్లేదా’ అంటూ స్ఫూర్తిని రగిలిస్తూ మాట్లాడతాడు. నిజంగా అయాన్‌ గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు