సాధనమున సమకూరు సంగీతం!

ఆరో తరగతి చదివే పిల్లాడు.. సంగీతంలో అరుదైన రికార్డు సాధించాడు. అతి చిన్న వయసులో ఆ ఘనత సాధించడం నిజంగా గ్రేట్‌ అనే అనాలి. ఇంతకీ ఏంటా.

Published : 08 Dec 2021 00:54 IST

ఆరో తరగతి చదివే పిల్లాడు.. సంగీతంలో అరుదైన రికార్డు సాధించాడు. అతి చిన్న వయసులో ఆ ఘనత సాధించడం నిజంగా గ్రేట్‌ అనే అనాలి. ఇంతకీ ఏంటా.. రికార్డు, ఎవరా నేస్తం? తెలుసుకునేందుకు చదివేయండి.

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌కు చెందిన సౌరోజిత్‌ దత్తా, వయసు 12 ఏళ్లు. అమ్మానాన్న సుపర్ణ, సుమిత్‌ దత్తా

అతి పిన్న వయస్కుడిగా..
విషయమేంటంటే.. ఏటా లండన్‌లోని అసోసియేటివ్‌ ఆఫ్‌ ట్రినిటీ కాలేజ్‌ ‘ఏటీసీఎల్‌’ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో సంగీత కళాకారులంతా పాల్గొంటారు. వయసుతో సంబంధం లేదు, ప్రతిభ ఉంటే చాలు.. ఎవరైనా పాల్గొనవచ్చు. కాబట్టి మన నేస్తం కూడా ఈ పరీక్షలో పాల్గొని సంగీతంలో లెవల్‌ 4 డిప్లొమా సాధించాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించడం చాలా అరుదు. అందుకే అతి పిన్న వయసులో ఈ పరీక్ష పాసయిన భారతీయ చిన్నారిగా రికార్డు సృష్టించాడు.  

కేవలం రెండేళ్లలోనే..
సౌరోజిత్‌కి చిన్నప్పట్నుంచీ సంగీతమంటే చాలా ఇష్టమట. అందులోనూ పియానో వాయించడం అంటే మరీ ఇష్టం. ఆ ఆసక్తితోనే తనకు తొమ్మిదేళ్లప్పుడు పియానో నేర్చుకుంటానని అమ్మానాన్నతో చెప్పాడు. వాళ్లు కూడా తన ఇష్టాన్ని గ్రహించి సరే అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు అవడంతో.. అవి అవగానే, మిగతా సమయమంతా పియానో సాధనలోనే గడిపేవాడు. అలా సంగీతంలో అన్ని మెలకువలు తెలుసుకున్నాడు. కేవలం రెండేళ్లలోనే సంగీతంలో పట్టు సాధించాడు.

రోజుకు ఆరుగంటలు..
తర్వాత లండన్‌లో జరిగే పరీక్ష గురించి తెలుసుకుని తనూ పోటీపడ్డాడు. ఇందుకోసం రోజుకు ఆరుగంటలు సాధన చేసేవాడు. అటు చదువుకుంటూనే ఇటు సన్నద్ధమయ్యేవాడు. తన ప్రయత్నం వృథా కాలేదు. పరీక్షలో పాసై ఎవ్వరూ ఊహించనంతగా.. రికార్డు బద్దలు కొట్టాడు. సాధించాలనే తపన ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే కదా నేస్తాలూ.. అన్నట్టు సౌరోజిత్‌కు భవిష్యత్తులో కన్సల్టెంట్‌ పియానిస్ట్‌ అవ్వాలనేది లక్ష్యమట. అలాగే తదుపరి స్థాయికి చేరుకోవడానికి వచ్చే నెలలో ‘ఎల్‌టీసీఎల్‌’ పరీక్ష ఉంది. ఇందుకోసం సన్నద్ధం అవుతున్నాడు. మరి ఇంత పట్టుదలతో సాధన చేస్తున్న చిన్నారికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని