Published : 10 Dec 2021 00:49 IST

చిన్నారి కోయిలమ్మ!

వయసు కేవలం పదేళ్లు.. తన చిట్టి చిట్టి చేతులతో వయోలిన్‌ వాయిస్తూ.. సన్నని వేళ్లతో పియానో మీటుతూ.. తీయని గొంతుకతో పాట పాడింది. నిజానికి రెండేళ్ల వయసున్నప్పటి నుంచే ఈ చిన్నారి సంగీత సాధన చేస్తోంది. అంటే మాటలు కూడా సరిగా రాని వయసులోనే స..రి..గ..మ..లు పలికిందన్నమాట. ఇంతకీ ఎవరా చిన్నారి..? తన పేరేంటో..? తెలుసుకుందామా!

ఈ చిట్టితల్లి పేరు మహతి సుబ్రహ్మణ్యం. వీళ్లది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబమే. తాత ఎల్‌.సుబ్రహ్మణ్యం ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు. బామ్మ కవితా కృష్ణమూర్తి గాయకురాలు. మహతి వాళ్ల అమ్మ బిందు సుబ్రహ్మణ్యం కూడా గాయని. కేవలం గాయని మాత్రమే కాదు.. ఆమె పాటల రచయిత కూడా. తన చుట్టూ సంగీత ప్రపంచమే ఉంది కాబట్టి మన మహతికి కూడా చాలా చిన్నవయసు నుంచే దాంతో అనుబంధం ఏర్పడింది. తాతయ్య ప్రోత్సాహంతో తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పాడటం మొదలు పెట్టింది. కేవలం పాడటమే కాదు.. శ్రోతలనూ మెప్పించింది.

నిత్య సాధన..
అలా అప్పటి నుంచి నిత్యం సాధన చేస్తూనే ఉంది. కేవలం పాటలు పాడటంతోనే ఆగిపోకుండా.. సంగీత పరికరాలను ప్లే చేయడం కూడా నేర్చుకుంది. వయోలిన్‌, పియానోల మీద అద్భుతంగా సంగీతాన్ని పలికిస్తుంది. ఓ వైపు పాడుతూనే.. మరోవైపు వీటిని ప్లే చేయగల ప్రతిభాశాలి.

ఇది మన స్పందన...  
ఇటీవల మహతి ‘హౌ వియ్‌ ఫీల్‌’ అని ఓ పాట పాడి, దాన్ని ఎడిట్‌ చేసింది. ఈ పాట స్పాటిఫై, జియోసావన్‌, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ‘సమ్‌ టైమ్స్‌ వియ్‌ హావ్‌టూ బి లీడర్స్‌ అండ్‌ అదర్‌ టైమ్స్‌ ద టీచర్స్‌’ అంటూ సాగుతుంది ఈ పాట. ఇందులో టీనేజర్ల కష్టాలు, ఇబ్బందుల గురించి ఉంటుంది. అన్నట్లు ఈ పాటను కూడా తనే సొంతంగా రాసింది.

జిమ్నాస్టిక్స్‌లోనూ ప్రావీణ్యం....
కేవలం సంగీతంలోనే కాదు.. మహతికి జిమ్నాస్టిక్స్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. ‘హౌ వియ్‌ ఫీల్‌’ అనే పాట వీడియోలో తన జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలను కూడా జోడించింది. ఇంత చిన్న వయసులోనే ఇదంతా చేయడం నిజంగా గ్రేట్‌ కదూ! మరి మన మహతి భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటూ మనసారా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా నేస్తాలూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు