సెట్‌రైట్‌.. బ్రదర్స్‌!

‘విమానాన్ని ఎవరు కనిపెట్టారు?’ అని మనల్ని ఎవరైనా అడిగితే రైట్‌ బ్రదర్స్‌ అని మీరు టక్కున చెబుదారు కదూ! ‘మరి మీకు సెట్‌రైట్‌ బ్రదర్స్‌ గురించి తెలుసా?’ అని అడిగారనుకోండి...! ‘సెట్‌రైట్‌ బ్రదర్సా?.. వీళ్లెవరబ్బా..?’

Published : 11 Dec 2021 00:21 IST

‘విమానాన్ని ఎవరు కనిపెట్టారు?’ అని మనల్ని ఎవరైనా అడిగితే రైట్‌ బ్రదర్స్‌ అని మీరు టక్కున చెబుదారు కదూ! ‘మరి మీకు సెట్‌రైట్‌ బ్రదర్స్‌ గురించి తెలుసా?’ అని అడిగారనుకోండి...! ‘సెట్‌రైట్‌ బ్రదర్సా?.. వీళ్లెవరబ్బా..?’ అని అవాక్కవుతారు కదా! వెంటనే స్మార్ట్‌ఫోన్‌ తీసుకుని ‘సెట్‌రైట్‌ బ్రదర్స్‌’ అని గూగుల్‌ చేసి చూస్తారు కదూ! ఆ అవసరం లేదు.. అలా వెతికితే మీకు వివరాలు దొరకవు కూడా! ఓ పని చేయండి.. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది ఆ ‘సెట్‌రైట్‌ బ్రదర్స్‌’ గురించి!

ప్పుడు ఎక్కడ చూసినా పర్యావరణ మార్పుల గురించే చర్చంతా.. చలికాలం వచ్చిందంటే చాలు మన దేశరాజధాని దిల్లీ కాలుష్యంపైనే అందరి చూపు. వాయుకాలుష్యాన్ని తగ్గించి, వాతావరణాన్ని ‘సెట్‌రైట్‌’ చేయడానికి ఓ ఇద్దరు దిల్లీకి చెందిన సోదరులు 2018 సంవత్సరం నుంచే ఉడతా భక్తిగా, తమ వంతుగా కృషి చేస్తున్నారు. వాళ్లే విహాన్‌ అగర్వాల్‌ (17), నవ్‌ అగర్వాల్‌ (14). వీరి ప్రయత్నానికి గుర్తింపు కూడా దక్కింది. ఇటీవలే వీళ్లు ‘2021 కిడ్స్‌ రైట్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్‌’ను నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత కైలాస్‌ సత్యార్థి చేతుల మీదుగా అందుకున్నారు.

బాల్యం నుంచే తపన...  

విహాన్‌, నవ్‌కు చిన్నప్పటి నుంచే పర్యావరణ స్పృహ ఎక్కువ. అదే వారిని ఈ దిశగా ఆలోచించేలా చేసింది. దిల్లీ కాలుష్యంలో దాదాపు 33శాతం డంపింగ్‌ యార్డుల్లో వ్యర్థాలను మండించడం వల్లే వస్తోంది. ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను విడదీసి ఇచ్చినా.. డంపింగ్‌యార్డుల్లో మాత్రం వాటిని కలగాపులగంగా పడేయడం, వాటికి నిప్పు పెట్టడం ఈ ఇద్దరూ గమనించారు. 2017లో ఘాజీపూర్‌ ల్యాండ్‌ఫిల్‌ సైట్‌లో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు మరణించడం వీరిని ఆలోచనలో పడేసింది. అందుకే స్కూలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని గంటలు పర్యావరణ పరిరక్షణ కోసం వెచ్చించాలనే నిర్ణయానికొచ్చారు.

ఆలోచన నుంచి ఆచరణ దిశగా..

ఈ ఇద్దరు సోదరులు ‘వన్‌ స్టెప్‌ గ్రీనర్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. వీళ్లు ప్రజల నుంచి స్వచ్ఛందంగా రీసైక్లింగ్‌ చేయగలిగిన వ్యర్థాలను సేకరిస్తారు. వాటిని నామమాత్రపు ధరకు రీసైక్లింగ్‌ సంస్థలకు అమ్ముతారు. దీనివల్ల ఎన్నో టన్నుల వ్యర్థాలు డంపింగ్‌యార్డుకు చేరకుండా రీసైక్లింగ్‌ అయ్యాయి. మొదట్లో వీరు 15 ఇళ్ల నుంచి వీటిని సేకరించారు. ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 1000 ఇళ్లకు చేరింది. ఈ ఒక్క సంవత్సరమే వాళ్లు ఇప్పటి వరకు 1,73,630 కిలోల వ్యర్థాలను రీసైక్లింగ్‌ యూనిట్లకు తరలించారు. కేవలం వ్యర్థాలు సేకరించడంతోనే ఆగిపోకుండా మొక్కలు కూడా నాటుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యికిపైగా మొక్కల్ని నాటి వాటిని సంరక్షిస్తున్నారు. పర్యావరణ పరిక్షణ గురించి ఇతరులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. పర్యావరణం కోసం ఇంతలా పాటుపడుతున్నారు కాబట్టే... ఈ ఇద్దరు సోదరులకు ‘2021 కిడ్స్‌ రైట్స్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్‌’ వచ్చింది. ఇప్పటికైనా ఒప్పుకుంటారా.. విహాన్‌, నవ్‌ ఇద్దరూ ‘సెట్‌రైట్‌ బ్రదర్స్‌’ అని!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని