బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట.. కుట్టుపిట్ట!

‘బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట.. వరకు ఓకే.. కానీ ఆఖర్లో ఆ కుట్టుపిట్ట ఏంటబ్బా!’ అని ఆలోచిస్తున్నారు కదూ! కుట్టే పిట్ట కాబట్టి అది కుట్టుపిట్ట! ‘కుడుతుందా.. ఇంతకీ ఏం కుడుతుంది?’ అని మీరు అడగాలి అనుకుంటున్నారు కదా!  ఎందుకంత తొందర.. నెమ్మదిగా.. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది!!

Published : 16 Dec 2021 00:25 IST

‘బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట.. వరకు ఓకే.. కానీ ఆఖర్లో ఆ కుట్టుపిట్ట ఏంటబ్బా!’ అని ఆలోచిస్తున్నారు కదూ! కుట్టే పిట్ట కాబట్టి అది కుట్టుపిట్ట! ‘కుడుతుందా.. ఇంతకీ ఏం కుడుతుంది?’ అని మీరు అడగాలి అనుకుంటున్నారు కదా!  ఎందుకంత తొందర.. నెమ్మదిగా.. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది!!

మామూలుగా పక్షులు గూళ్లు కట్టుకుంటాయి... కదా! కానీ ఈ పక్షి మాత్రం తన గూడును కుట్టుకుంటుంది. అవును మీరు చదువుతోంది నిజమే! అందుకే దాన్ని ‘టైలర్‌ బర్డ్‌’ అని పిలుస్తారు. ఈ పక్షులు మన ఆసియా ఖండంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కేవలం అడవుల్లోనే కాదు.. పట్టణాలు, నగరాల్లోనూ జీవిస్తుంటాయి. ఇవి చెట్ల కొమ్మలకున్న ఆకులను కలిపి కుట్టి దాన్ని గూడులా చేసుకుంటాయి. అందులోనే గుడ్లను పెట్టి, అవి పిల్లలను పొదుగుతాయి.

ఎలా కుడుతుందంటే..

ఇంతకీ ఇది ఆకులను ఎలా కుడుతుందో తెలుసా.. పత్తితో. అవును ఇది పత్తి, ఇతర మొక్కల నుంచి దూదిని సేకరించి దాన్ని దారంలా చేసి తన ముక్కుతో ఆకులకు రంధ్రాలు చేసి, కలిపి కుడుతుంది. అప్పుడు అది గుహలా ఏర్పడుతుంది. అలా గుహలా ఏర్పడ్డ ఆకుల మధ్యలో పత్తి, మెత్తని గడ్డితో ఆ ఖాళీని నింపుతుంది. ఆ తర్వాత మెత్తటి ఆ గూడులో ఎంచక్కా ‘టైలర్‌ బర్డ్‌’ గుడ్లను పెడుతుంది.

పిట్టకొంచెం.. కూత ఘనం!

గుప్పెడు కూడా ఉండని ఈ పిట్ట చాలా బిగ్గరగా అరుస్తుంది. దీని అరుపైతే గట్టిగా ఉంటుంది కానీ.. దీనికి సిగ్గు ఎక్కువ. మనుషులు కనబడితే చాలు దూరంగా వెళ్లిపోతుంది. ఈ బుజ్జి పక్షి కేవలం 3 నుంచి 5 అంగుళాలు ఉంటుందంతే. బరువేమో 6 నుంచి 10 గ్రాములు ఉంటుంది. రెక్కలు చిన్నగా ఉన్నప్పటికీ తోక మాత్రం పొడవుగా ఉంటుంది. కాళ్లూ బలంగా ఉంటాయి. ఇవి మనదేశంతోపాటు, శ్రీలంకలోనూ ఎక్కువగా కనిపిస్తుంటాయి. నేస్తాలూ..! మొత్తానికి ఇవీ ‘టైలర్‌ బర్డ్‌’ విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని