బుడతడు.. అసలే తడబడడు!

వయసు కేవలం నాలుగేళ్లు. కానీ ప్రతిభ మాత్రం ఘనం! ఇతర పిల్లలు మాట్లాడడానికే తడబడే వయసులో.. ఈ బుడతడు మాత్రం రికార్డులు సాధిస్తున్నాడు. ఇంతకీ ఈ చిన్నారి ఏం చేశాడో తెలుసా!

Published : 17 Dec 2021 00:11 IST

వయసు కేవలం నాలుగేళ్లు. కానీ ప్రతిభ మాత్రం ఘనం! ఇతర పిల్లలు మాట్లాడడానికే తడబడే వయసులో.. ఈ బుడతడు మాత్రం రికార్డులు సాధిస్తున్నాడు. ఇంతకీ ఈ చిన్నారి ఏం చేశాడో తెలుసా!

హైదరాబాద్‌కు చెందిన శ్రీమాన్‌ అకృత్‌ చిన్నప్పటి నుంచే చాలా చురుకు. తనకు కేవలం సంవత్సరం వయసు ఉన్నప్పటి నుంచే చాలా అనుమానాలు వచ్చేవి. వాటిని శ్రీమాన్‌ వాళ్ల అమ్మానాన్నలైన రాజీవ్‌, సుప్రజ చాలా ఓపిగ్గా నివృత్తి చేసేవారు. ఏడాది వయసు నుంచే రైమ్స్‌, కలర్స్‌, జంతువుల పేర్లు, వాటి అరుపులు చెప్పేసేవాడు. ప్రతిరోజూ కనీసం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేవాడు.

అనగనగా ఓ రోజు

ఓరోజు శ్రీమాన్‌ వాళ్ల అమ్మ.. బంధువుకు తీసివేతల గురించి చెబుతుంటే.. శ్రీమాన్‌ వెంటనే దానికి జవాబు చెప్పేశాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయారు. శ్రీమాన్‌కు చాలా జ్ఞాపకశక్తి ఉందని గ్రహించారు. అప్పటి నుంచి నెగెటివ్‌ నంబర్స్‌ (రుణాత్మక సంఖ్యలు), తీసివేతల గురించి చిన్నారికి చెప్పారు. శ్రీమాన్‌ కూడా వెంటనే నేర్చుకున్నాడు.

చిరుత వేగం

ప్రస్తుతం శ్రీమాన్‌.. ఆంగ్లవర్ణమాలలో ‘బి’ నుంచి ‘తి’ వరకు రివర్స్‌లో కేవలం 3.6 సెకన్లలో చెప్పగలడు. నాలుగేళ్ల వయసులో ఇంత వేగంగా చెప్పడం నిజంగా గొప్ప విషయమే. అలాగే ఒక నిమిషంలో తడబడకుండా 20 నెగెటివ్‌ నంబర్స్‌ వరకు లెక్కగట్టి ప్రపంచ రికార్డూ సృష్టించాడు. అతిచిన్న వయసులో ఈ ఘనత సాధించి ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు. మన శ్రీమాన్‌ మొత్తానికి అదరగొట్టాడు కదూ! ఈ బుడతడు భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించి, మరింత పేరు తెచ్చుకోవాలని మనమూ మనసారా కోరుకుందామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని