కమలి.. కాళ్లకు చక్రాలున్న చిరుత!

‘రోలర్‌ స్కేటింగ్‌.. షూస్‌కు చక్రాలుంటాయి. వాటి మీద నిల్చొని బ్యాలెన్స్‌ చేస్తూ దూసుకుపోవాలి’.. ఇది చదవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది.. అందుకే మీరు ‘ఓస్‌.. ఇంతేనా!’ అంటారు. కానీ.. ఆడితేనే అసలు విషయం తెలుస్తుంది.

Published : 27 Dec 2021 00:35 IST

‘రోలర్‌ స్కేటింగ్‌.. షూస్‌కు చక్రాలుంటాయి. వాటి మీద నిల్చొని బ్యాలెన్స్‌ చేస్తూ దూసుకుపోవాలి’.. ఇది చదవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది.. అందుకే మీరు ‘ఓస్‌.. ఇంతేనా!’ అంటారు. కానీ.. ఆడితేనే అసలు విషయం తెలుస్తుంది. కిందపడకుండా బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. విదేశాల్లో ఈ ఆట ఫేమస్‌. కానీ మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. నేర్చుకుందామన్నా వసతులు తక్కువ. అలాంటి క్రీడలో ఓ చిన్నారి చిరుతలా దూసుకుపోతోంది!

మిళనాడులోని మహాబలిపురానికి చెందిన 12 సంవత్సరాల కమలి రోలర్‌స్కేటింగ్‌లో రాణిస్తోంది. ఇటీవల పంజాబ్‌లోని మొహాలీలో జరిగిన ‘నేషనల్‌ రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌’లో ఏకంగా వెండి పతకాన్ని కైవసం చేసుకుంది.

సరైన శిక్షణ లేకుండానే..
కమలి నిజానికి సరైన శిక్షణ తీసుకోలేదు. వాళ్ల గ్రామానికి వచ్చిన విదేశీయుల దగ్గర చూసి మాత్రం అనుకరించింది. తనకు నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే ఈ రోలర్‌ స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది. అలా తనకున్న పరిధిలోనే మెలకువలు నేర్చుకుంది.

గెలుస్తా అనుకోలేదు..  
మన కమలి ఇంత వరకు అంతదూరం ఎప్పుడూ వెళ్లలేదు. మొహాలీలో పోటీలకు వెళ్లేటప్పుడు కేవలం చపాతీలు, పెరుగు, వెన్నతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. మామూలుగా తాను తినే అన్నం ఎక్కడా దొరకలేదు! అసలు పోటీలో కూడా గెలుస్తా అని కూడా అనుకోలేదట! ఊరికే తన ఆటను ప్రదర్శించింది. కానీ ఏకంగా వెండి పతకాన్నే గెలుచుకుంది. దీంతో తను ‘ఆసియా రోలర్‌ స్పోర్ట్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో పాల్గొనే అర్హతను సాధించింది. ఈ సారి మాత్రం ఎలా అయినా సరే.. తాను బంగారు పతకాన్ని సాధించి తీరతాను అని నమ్మకంగా చెబుతోంది. మరి మనమూ చిన్నారి కమలికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని