భేష్‌.. రేయాన్ష్‌!

ఆరేళ్ల బుడతడు అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. ఏ ప్రశ్న అడిగినా టక్కున చెబుతున్నాడు. అంతేనా రికార్డులూ సాధిస్తున్నాడు. ఆ నేస్తమెవరో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి మరి..

Published : 28 Dec 2021 00:34 IST

ఆరేళ్ల బుడతడు అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. ఏ ప్రశ్న అడిగినా టక్కున చెబుతున్నాడు. అంతేనా రికార్డులూ సాధిస్తున్నాడు. ఆ నేస్తమెవరో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి మరి..

చిన్నారి పేరు సింగవరపు రేయాన్ష్‌. వయసు ఆరేళ్లు. ఉండేది హైదరాబాద్‌లో.

జ్ఞాపకశక్తి ఎక్కువే!

రేయాన్ష్‌కు చిన్నప్పట్నుంచీ జ్ఞాపకశక్తి ఎక్కువ. అది గ్రహించిన అమ్మానాన్న చిన్నప్పట్నుంచీ అన్నీ నేర్పించేవారు. చెప్పింది చెప్పినట్లు గుర్తుంచుకుని తిరిగి చెప్పేవాడు. అలా రేయాన్ష్‌కు అన్నింటి గురించి అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఏది అడిగినా, ఏం చెప్పినా అసలు విసుక్కోడట. అన్నీ చక్కగా నేర్చుకుంటాడట. తన ఆసక్తి, జ్ఞాపకశక్తి చూసి మురిసిపోతున్నారు అమ్మానాన్న. 

లెక్కల్లో మేటి!

రేయాన్ష్‌కు 51 జంతువుల బొమ్మలు చూపిస్తే టకటకా వాటి పేర్లు చెప్పేశాడు. 65 దేశాల జాతీయ జెండాలు గుర్తు పట్టేశాడు. ఆ దేశాల రాజధానులు, కరెన్సీ సైతం చెప్పేస్తున్నాడు. అన్నట్టు రేయాన్ష్‌ను సూర్యనమస్కారాలు ఎలానో అడిగి చూడండి. చక్కగా చేసి చూపిస్తాడు. అంతేనా వాటి పేర్లు, అర్థం కూడా చెప్పేస్తాడు. అలాగే చెస్‌ బాగా ఆడతాడు. అటు చదువులోనూ చురుకే. లెక్కల్లో కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తాడు. అంతేకాదు నేస్తాలూ.. 82 స్మారక కట్టడాలను చూపిస్తే వాటిని గుర్తించి టకటకా చెప్పేశాడు. తన ప్రతిభను అందరికీ తెలియజెప్పాలని రికార్డ్స్‌ కమ్యూనిటీకి తెలియజేశారు అమ్మానాన్న. వాళ్లు రేయాన్ష్‌ ప్రతిభకు మెచ్చి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో తన పేరు నమోదు చేసేశారు. అదీ సంగతి. మరి రేయాన్ష్‌ను మీరూ అభినందించేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని