మన నేస్తం.. నవల రాసేసిందోచ్‌!

ఏంటీ.. నవల రాసిందా!! అని ఆశ్చర్యపోతున్నారా? అవును నేస్తాలూ! మనం చిన్నకథ రాస్తేనే అమ్మానాన్న గొప్పగా చెప్పుకొంటారు కదా! మరి ఈ నేస్తం ఏకంగా   నవల రాసిందంటే.. నిజంగా గ్రేట్‌ కదూ! ఇంతకీ ఎవరీ నేస్తం?

Published : 01 Jan 2022 02:16 IST

ఏంటీ.. నవల రాసిందా!! అని ఆశ్చర్యపోతున్నారా? అవును నేస్తాలూ! మనం చిన్నకథ రాస్తేనే అమ్మానాన్న గొప్పగా చెప్పుకొంటారు కదా! మరి ఈ నేస్తం ఏకంగా   నవల రాసిందంటే.. నిజంగా గ్రేట్‌ కదూ! ఇంతకీ ఎవరీ నేస్తం? తెలుసుకునేందుకు చదివేయండి..

నేస్తం పేరు నీర్జా భట్‌. వయసు 14 ఏళ్లు. అహ్మదాబాద్‌కు చెందిన నీర్జా ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఆరేళ్లవయసు నుంచే!
నీర్జా చిన్నప్పట్నుంచి ఎక్కువగా పుస్తకాలు చదివేదట. అంతేనా ఆరేళ్ల వయసులోనే కవితలు, కథలు రాసేసిందట. అవి చూసిన అమ్మానాన్న నీర్జా ప్రతిభకు ప్రోత్సాహం అందించారు. తనేం చదవాలనుకుంటుందో చెబితే చాలు.. ఆ పుస్తకాన్ని వెతికి మరీ పట్టుకు వచ్చేవారు.

ఆమే ఆదర్శం!
నోబెల్‌ బహుమతి గ్రహీత, అమెరికన్‌ నవలా రచయిత్రి టోనీ మొర్రిసన్‌ అంటే నీర్జాకు చాలా ఇష్టమట. ఆమె పుస్తకాలు చదివే, నీర్జా నవల రాయగలిగింది. టోనీ నవల్లో ఒక సూక్తి ఉందట. అది నీర్జాను బాగా ప్రభావితం చేసింది. అదేంటంటే.. ‘మీరు చదవాలనుకున్న పుస్తకం ఏదైనా ఉంటే.. అది ఇంకా ఎవరూ రాయకపోతే.. దాన్ని మీరు తప్పక రాయండి’ అని టోనీ పుస్తకాల్లో రాసుందట. ఇది చదివాక నీర్జాకు కావలసిన పుస్తకాన్ని తనే సొంతంగా రాయాలనుకుంది. అయితే అటు చదువుతూ ఇటు కుదిరేది కాదు. దాంతో లాక్‌డౌన్‌ సమయాన్ని ఇందుకోసం వెచ్చించింది. ఆ సమయంలో రాసిన నవలకు ‘ ది బ్యాడ్‌ ఎరా- పార్ట్‌ 1’ అని పేరు పెట్టి, ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇదొక ఫాంటసీ కథంట. ఇది మనకు తెలియని మరో ప్రపంచమని చెబుతోంది నీర్జా. ఇంత చిన్న వయసులో అంత పరిణతిగా ఆలోచిస్తూ నవల రాయడం అంటే గ్రేటే కదా! అన్నట్టు మన నీర్జా, పియానో కూడా భలేగా వాయిస్తుంది. బేకింగ్‌ చేయడం కూడా తనకిష్టమట. అటు చదువుతూనే ఇటు తనకిష్టమైన పనుల్లో బిజీగా ఉంటుంది నీర్జా. అదన్నమాట సంగతి. మరి నీర్జాను మీరూ అభినందించేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని