Published : 03 Jan 2022 02:04 IST

కుంచె పడితే.. కచ్చితంగా బహుమతే!

ఓ చిన్నారి చిత్రలేఖనంలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. తను గీసిన బొమ్మలతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది. అంతేనా.. చిన్న వయసులోనే జేఎన్‌ఎఫ్‌లో పెయింటింగ్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకున్న చిన్నారిగా ఘనత సాధించింది. ఇంతకీ తనెవరో తెలుసుకుందామా!

హైదరాబాద్‌కు చెందిన జునాలీ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతోంది. అమ్మానాన్నలు చలంచర్ల సునీల్‌ కుమార్‌, సంధ్యారాణి.

రంగుల లోకంలో..

జునాలీకి చిన్నప్పట్నుంచీ బొమ్మలేయడం అంటే చాలా ఇష్టం. జునాలీ మూడో తరగతి చదివే సమయంలో టీవీలో వచ్చే బొమ్మల్ని చూస్తూ రంగులు అద్దేది. తన ఆసక్తిని గమనించిన అమ్మానాన్న చిత్రలేఖనం పోటీల్లో శిక్షణకు పంపించారు. జునాలీ చక్కగా నేర్చుకుంటూ అద్భుతమైన చిత్రాలు ఆవిష్కరిస్తోంది.

బహుమతులు బోలెడు..!

యూనివర్సిటీ ఆఫ్‌ మీరట్‌ నిర్వహించిన అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీల్లో పాల్గొని ద్వితీయ బహుమతి సాధించింది. శ్రీహారికోటలో శార్‌ నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనంలో తృతీయ బహుమతి పొందింది. ఎన్‌టీపీసీ నిర్వహించిన ‘విద్యుత్‌ పొదుపు’ పెయింటింగ్‌ పోటీల్లో పాల్గొని పదివేల నగదు బహుమతి పొందింది. అలా ఇప్పటివరకూ తను గీసిన చిత్రాలకు వందకు పైగా బహుమతులు సాధించింది.

ఎన్నెన్నో.. ప్రశంసలు!

చిన్నారులకు జేఎన్‌ఎఫ్‌లో సీటు రావడమంటే మాటలు కాదట! అలాంటిది అక్కడే కోర్సు కూడా చేసి, సర్టిఫికెట్‌ తెచ్చుకున్న చిన్నారిగా జునాలీ ఘనత సాధించింది. ఇక జునాలీ జంతువులు, వన సంరక్షణ, జంతు సంరక్షణ, నదుల మీద భావోద్వేగమైన చిత్రాలు గీసింది. చెన్నై అరిగ్‌నార్‌ అన్నా జూలాజికల్‌ పార్క్‌, కోల్‌కతాలోని అలిసొరి జూలాజికల్‌ పార్క్‌, విశాఖపట్నం ఇందిరాగాంధీ పార్క్‌, హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌, డెహ్రాడూన్‌లో వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వాళ్లంతా జునాలీ గీసిన బొమ్మలకు మెచ్చి, అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందించారు. అన్నట్టు చిత్రకారుడు ఎమ్‌.ఎఫ్‌. హుస్సేన్‌ పెయింటింగ్స్‌ అంటే జునాలీకి చాలా ఇష్టమట. ఆయనే స్ఫూర్తి అని, ఆయనలా పేరు తెచ్చుకోవాలనేది తన లక్ష్యమని చెబుతోంది జునాలీ. మరింకేం నేస్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి.

- జ్యోతి కిరణ్‌, ఈటీవీ హైదరాబాద్‌ బ్యూరో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని