Published : 06 Jan 2022 00:12 IST

ఎదురులేని వెదురు గ్రామం!

కనుచూపు మేర అంతా వెదురే! నాలుగు గోడలూ వెదురే! పై కప్పూ వెదురే! వంతెనలూ వెదురే! ఆఖరుకు నడిచే దారి కూడా వెదురే! ‘ఆ.. ఇదంతా ఎక్కడో విదేశాల్లో అయి ఉంటుందిలే!’ అనుకుంటే తప్పులో కాలేసినట్లే! అంతా.. ఇదంతా మన దేశంలోనే!

ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు పార్క్‌ త్రిపురలో ఏర్పాటైంది. ఇది రాజధాని నగరం అగర్తలాకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చక్కటి స్కూలు, హాస్టల్‌, యోగా సెంటర్‌, మైదానం, చూడచక్కని నీటికొలనులు, వెదురుతో తయారైన కాటేజీలున్నాయి. నిజానికి 2009 నుంచే ఈ వెదురుగ్రామం నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతానికి ఓ రూపు సంతరించుకుంది.

14 రకాల వెదురుతో..

మనం వెదురు అంటే ఒకటే అనుకుంటాం. కానీ ఇందులో కొన్ని వేల రకాలున్నాయి తెలుసా! ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యికిపైగా వెదురు రకాలున్నాయి. అందులో మన దేశంలో వందకు పైగా రకాలున్నాయి. ఈ వెదురుగ్రామంలో మాత్రం ఓ 14 రకాలున్నాయి. ఇంకా పచ్చని చెట్లు, ఆయుర్వేద, ఔషధమొక్కలు కూడా ఉన్నాయి. అంతేకాదు నేస్తాలూ.. త్వరలో ఈ ‘వెదురు గ్రామం’లో ఓ మ్యూజియం కూడా ఏర్పాటు కానుంది. ఇందులో వెదురుతో తయారైన పురాతన, నూతన వస్తువులను ప్రదర్శనకు పెట్టనున్నారట.

ఏకంగా 135 ఎకరాల్లో...

త్రిపుర ప్రభుత్వం 135 ఎకరాల్లో ఈ వెదురువనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం 30 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. వెదురుతో టైల్స్‌, ఫర్నీచర్‌, వెదురు గోడలు తయారు చేసే పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వెదురుతో నీళ్లసీసాలు, బుట్టలు, క్రికెట్‌ బ్యాట్లు, మొబైల్‌ స్టాండ్లు ఇలాంటి ఉత్పత్తులూ తయారవుతున్నాయి. ఇలా మొత్తానికి వెదురువల్ల చాలా ఉపయోగాలున్నాయి. అందుకే త్రిపుర, మిజోరం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో వెదురును సాగుచేస్తున్నారు. మొత్తానికి ఇవీ ‘వెదురు గ్రామం’ విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని