Published : 11 Jan 2022 00:50 IST

నాన్న పేరు నిలబెట్టింది..

ఆడపిల్లకు ఆటలెందుకు అన్నారట. ఆ మాటను తిప్పికొడుతూ పట్టుదలతో పతకాలు సాధిస్తోంది ఓ నేస్తం. తనెవరో ఏంటో తెలుసుకునేందుకు చదివేయండి..

నేస్తమే రాజమహేంద్రవరానికి చెందిన థాన్యశ్రీ. వయసు 11 ఏళ్లు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతోంది. అమ్మ అనురాధ, నాన్న సురేష్‌.  

నాన్న ప్రోత్సాహంతో..

2019లో రాజమహేంద్రవరంలో ఓ టేబుల్‌ టెన్నీస్‌ అకాడమీ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అప్పుడు థాన్యశ్రీకి వాళ్ల నాన్న అందులో శిక్షణ ఇప్పించారు. థాన్యశ్రీ కూడా చక్కగా నేర్చుకుంటూ నైపుణ్యం సాధించింది. పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించేది. చాలా బాగా ఆడుతోందని జాతీయ స్థాయి పోటీలకు శిక్షణ ఇప్పించాలని నిర్వాహకులు థాన్యశ్రీ వాళ్ల నాన్నకు చెప్పారు. అయితే అప్పటికే అక్క సిరిపావని టేబుల్‌టెన్నిస్‌ సాధన చేస్తోంది. ‘టేబుల్‌ టెన్నిస్‌ చాలా ఖరీదైన ఆట. ఒక్కరికే ఏడాదికి రూ.లక్ష వరకూ ఖర్చు అవుతోంది. ఇద్దరినీ ఆడించాలంటే చాలా ఆర్థిక భారం అవుతుంది‘ అని బంధువులు చెప్పారు. కొందరు తెలిసిన వాళ్లు ‘ఆడపిల్లలకు ఆటలెందుకు’ అన్నారు. కానీ పిల్లల పట్టుదల చూసిన వాళ్ల నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా ఆట మాన్పించలేదు.

ఆట వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది...

సాధన మొదలు పెట్టిన మూడేళ్లలో మూడుసార్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది థాన్యశ్రీ. ‘టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకటించిన జాతీయ ర్యాంకుల్లో అండర్‌-11 విభాగంలో 19వ ర్యాంకు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అండర్‌-11లో గత పదేళ్లుగా ఈ ర్యాంకు సాధించిన క్రీడాకారులే లేరు. అన్నట్టు ఆటల ధ్యాసలో చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఉదయం పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత మూడు గంటల పాటు అక్కతో కలిసి సాధన చేస్తోంది. సాధన తరువాత ఆ రోజు చదవాల్సిన అంశాలు పూర్తి చేస్తుంది. ‘ఆటపై దృష్టి పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఒక్కసారి చదివితే గుర్తుండిపోతాయి. అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించటమే లక్ష్యంగా కృషి చేస్తున్నాను’ అని చెబుతోంది థాన్యశ్రీ. తను అనుకున్నది సాధించాలని.. మన నేస్తానికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేయండి మరి.

- ఉప్పాల రాజాపృథ్వీ, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు