జోషిత.. భలే ఘనత!

ఓ నేస్తం వెబ్‌సైట్‌ను రూపొందిస్తుందట. దాన్ని డెవలప్‌ కూడా చేస్తుందట. తన ప్రతిభను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేనా ప్రశంసలతో పాటూ రికార్డులూ అందుకుంటోంది.

Published : 13 Jan 2022 01:06 IST

ఓ నేస్తం వెబ్‌సైట్‌ను రూపొందిస్తుందట. దాన్ని డెవలప్‌ కూడా చేస్తుందట. తన ప్రతిభను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేనా ప్రశంసలతో పాటూ రికార్డులూ అందుకుంటోంది. తనెవరో ఏంటో తెలుసుకుందాం రండి.

నేస్తం పేరు హెచ్‌.జోషిత. ప్రస్తుతం పదేళ్లు. నాలుగో తరగతి చదువుతోంది. ఉండేది బెంగళూరులో.

అన్నయ్య ప్రోత్సాహంతో..

జోషిత వాళ్ల అన్నయ్య యశస్‌. ఓ ఇన్‌స్టిట్యూట్‌లో వెబ్‌సైట్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే జోషితకు ఏడేళ్ల వయసున్నప్పుడు వాళ్ల అన్నయ్య చేస్తున్న వర్క్‌ చూసి తనూ నేర్చుకుంటానంది. అది తనకు అర్థం కాదని చెప్పినా పట్టుదలగా వాళ్ల అన్నయ్య చేస్తుంటే చూసి తనూ అలా చేయడం మొదలు పెట్టింది. అది చూసిన వాళ్ల అన్నయ్య.. జోషితకు జ్ఞాపకశక్తి ఉందని గ్రహించి అప్పట్నుంచి తనకూ వెబ్‌సైట్‌ ఎలా రూపొందించాలో చెప్పాడు.


పట్టుదలతో సాధించింది..

అంతే చెప్పింది చెప్పినట్లు గుర్తుంచుకుని జోషిత కూడా ఆ విద్యలో ఆరితేరిపోయింది. అంతేకాదు వెబ్‌సైట్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కూడా నేర్చుకుని ప్రతిభ చాటుతోంది. అటు చదువుకుంటూనే ఇందులో నైపుణ్యం సాధించింది. పెద్దవాళ్లు చేస్తున్నట్లే చేస్తోంది. అలా ఏడేళ్ల వయసులోనే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం కూడా సంపాదించేసింది. ‘యంగెస్ట్‌ వెబ్‌డిజైనర్‌’గా పేరు తెచ్చేసుకుంది. అంతేనా అప్పట్నుంచి ఈ మూడేళ్లుగా మరింత సాధన చేసి ఎన్నో ప్రశంసలు అందుకుంటోంది. నిజంగా పట్టుదల ఉంటే వయసుతో పనేముంది. ఏదైనా సాధించేయొచ్చని నిరూపించింది కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని