ఆరోహి.. అధిరోహించింది!

ఆరేళ్ల వయసంటే.. తడబడే బుడిబుడి అడుగులు పరుగులుగా మారే ప్రాయం! కానీ ఓ బుడత మాత్రం ‘కొండలెక్కగలను.. ట్రెక్కింగ్‌ చేయగలను’ అంటూ.. ఏకంగా కోటలెక్కేస్తోంది. ఇంతకూ ఆ చలాకీ చిన్నారి ఎవరు? ఎలా ఎత్తైన కోటలు అధిరోహిస్తోందో తెలుసుకుందామా!

Published : 18 Jan 2022 01:29 IST

ఆరేళ్ల వయసంటే.. తడబడే బుడిబుడి అడుగులు పరుగులుగా మారే ప్రాయం! కానీ ఓ బుడత మాత్రం ‘కొండలెక్కగలను.. ట్రెక్కింగ్‌ చేయగలను’ అంటూ.. ఏకంగా కోటలెక్కేస్తోంది. ఇంతకూ ఆ చలాకీ చిన్నారి ఎవరు? ఎలా ఎత్తైన కోటలు అధిరోహిస్తోందో తెలుసుకుందామా!

రోహీ లోఖాండే.. స్వస్థలం మహారాష్ట్రలోని సతారా. తను ఇటీవల లింగానా కోట అధిరోహించింది. ‘ఆఁ.. కోటకు చేరుకోవడంలో వింతేముంది?!.. మెట్లు ఎక్కుతూ వెళ్లొచ్చు’ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది సముద్ర మట్టానికి దాదాపు 3,100 అడుగుల ఎత్తులో దాదాపు నిట్టనిలువుగా ఉంటుంది. దాన్ని చేరుకోవాలంటే ట్రెక్కింగ్‌ చేస్తూ వెళ్లాల్సిందే!

కాకలు తీరిన వారికే కష్టం!

ఈ లింగానాను ‘మహారాష్ట్ర ఎవరెస్ట్‌’ అని కూడా పిలుస్తుంటారు. ట్రెక్కింగ్‌లో కాకలు తీరిన వారు కూడా దీన్ని అధిరోహించాలంటే కాస్త వెనకా ముందూ అవుతారు. కానీ మన ఆరోహీ మాత్రం ఎంచక్కా.. చకచకా ఎక్కేసింది. అదీ సంప్రదాయ వస్త్రాల్లో!

నాన్న చేయి పట్టుకుని..

అందరు నాన్నలు తమ చిన్నారుల చేతులు పట్టుకుని బుడిబుడి అడుగులు వేయిస్తుంటారు. ఆరోహీ వాళ్ల నాన్న మాత్రం చిట్టి ఆరోహితో ట్రెక్కింగ్‌ చేయిస్తున్నారు. ఆమె ఇప్పటి వరకు 26 కోటలను సందర్శించింది. ఈ చిన్నారి ఆరోహీ.. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ మనసారా కోరుకుందామా ఫ్రెండ్స్‌.. మరింకేం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని