చిట్టిగుండె గట్టిగానే ఎదిరించింది!

చిట్టిగుండె గట్టిగానే ఎదిరించింది..బుజ్జి పిడికిలి ధైర్యంగా బిగుసుకుంది..చిన్ని గొంతు గంభీరంగా నిలదీసింది..గాయమైన దేహంతోనే గర్జించింది..తుపాకులు చుట్టుముట్టినా..గ్రనేడ్లు గాయపరిచినా..అదరక బెదరక అయినవాళ్లను కాపాడుకుంది..ఆనాటి ఆ అనుభవాలను

Published : 26 Jan 2022 00:44 IST

చిట్టిగుండె గట్టిగానే ఎదిరించింది..బుజ్జి పిడికిలి ధైర్యంగా బిగుసుకుంది..చిన్ని గొంతు గంభీరంగా నిలదీసింది..గాయమైన దేహంతోనే గర్జించింది..తుపాకులు చుట్టుముట్టినా..గ్రనేడ్లు గాయపరిచినా..అదరక బెదరక అయినవాళ్లను కాపాడుకుంది..ఆనాటి ఆ అనుభవాలను ఓ చిన్నారి మన ‘హాయ్‌బుజ్జీ’తో పంచుకుంది..ఆ వివరాలు ఆ బుడత మాటల్లోనే...

హాయ్‌ ఫ్రెండ్స్‌... నాపేరు గురుగు హిమప్రియ. మాది శ్రీకాకుళం జిల్లాలోని పొన్నాం అనే చిన్న గ్రామం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా..! ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ఎంపికైనందుకు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలబాలికలకు ఈ పురస్కారాన్ని ఏటా అందిస్తారు. ఇంతకీ నన్ను ఎందుకు ఎంపిక చేశారనేదే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా...
అది 2018వ సంవత్సరం. మా నాన్న ఉద్యోగం రీత్యా మేము జమ్మూ కశ్మీర్‌లోని సంజ్వాన్‌లో మిలటరీ క్యాంపులో ఉండేవాళ్లం. అప్పుడు నా వయస్సు సరిగ్గా తొమ్మిది సంవత్సరాలు. మా నాన్న సత్యనారాయణ, అమ్మ పద్మావతి, నేను, ఇద్దరుచెల్లెళ్లు అంతా కలిసి ఆర్మీ క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. ఆరోజు ఫిబ్రవరి 10. తెల్లవారుజామున 4 గంటలకు టెర్రరిస్టులు మా క్వార్టర్స్‌ మీద దాడి చేశారు.

ధైర్యంగా ఎదురు నిలిచా...
ఆ సమయంలో నాన్న డ్యూటీ కోసం ఉధంపూర్‌ వెళ్లారు. అమ్మ, నేను, ఇద్దరు చెల్లెళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నాం. టెర్రరిస్టులు లోపలికి రాకుండా తలుపులు మూసేశాం. వాళ్లు ఎన్నోసార్లు తలుపులు తన్నుతూ, తుపాకీతో కొడుతూ గట్టిగా అరిచారు. మేము భయపడకుండా తలుపు గట్టిగా పట్టుకునే ఉన్నాం. కానీ టెర్రరిస్టులు గ్రనేడ్లు లోపలికి విసిరేశారు. అమ్మకు పెద్ద గాయమై చాలా రక్తం పోయింది. నాకు ఒక భుజం పనిచేయలేదు. నేను వెంటనే తేరుకుని బయటకు వెళ్లి వాళ్ల ముందు నిలుచున్నాను. వాళ్లతో 4- 5 గంటలు వాదిస్తూ పోరాడాను. మాతో పాటు అక్కడున్న ఇంకొందరిని వదిలేయాలన్నాను. వారిని ఎలాగో ఒప్పించి అమ్మతో పాటు సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాం. తర్వాత ఆర్మీ వాళ్లకు సమాచారం ఇచ్చాను. వాళ్లు వచ్చి టెర్రరిస్టులను మట్టుబెట్టారు. అలా నన్ను నేను కాపాడుకోవడంతో పాటు మా అమ్మను, చెల్లెళ్లను ఇంకా కొంత మందిని కాపాడాను.

ప్రధానే మెచ్చుకున్నారు
నేను ప్రదర్శించిన ఈ ధైర్య సాహసాల్ని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌’ వాళ్లు గుర్తించారు. అసమాన ధైర్య సాహసాల కేటగిరీకి నన్ను ఎంపిక చేశారు. జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాతో వర్చువల్‌ విధానంలో మాట్లాడి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా... ఈ పురస్కారాల కోసం 2020- 21, 2021- 22కు సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 623 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 29 మాత్రమే ఎంపికయ్యాయి. అందులో నేనూ ఉన్నాను. ఈ పురస్కారానికి ఎంపికైనందుకు నాకు రూ.లక్ష నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా ఇచ్చారు. చూశారు కదా ఫ్రెండ్స్‌. కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు భయపడకుండా మనం చేయాల్సిన పనిని తప్పక చేయాలని గుర్తుంచుకోండి.  

- ప్రవీణ్‌ కుమార్‌ రుత్తల, ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని