భళా బాలకా.. ప్రాణ రక్షకా!

వయసు పన్నెండేళ్లు... బక్కపల్చని దేహం.. కానీ ఆ పిల్లాడి గుండెల్లో కొండంత ధైర్యం.. అదే మరో హృదయాన్ని ఆగిపోకుండా చేసింది. ఓ నిండు ప్రాణాన్ని పదిలంగా కాపాడింది. మరెందరిలోనో స్ఫూర్తిని నింపింది.

Published : 30 Jan 2022 00:07 IST

వయసు పన్నెండేళ్లు... బక్కపల్చని దేహం.. కానీ ఆ పిల్లాడి గుండెల్లో కొండంత ధైర్యం.. అదే మరో హృదయాన్ని ఆగిపోకుండా చేసింది. ఓ నిండు ప్రాణాన్ని పదిలంగా కాపాడింది. మరెందరిలోనో స్ఫూర్తిని నింపింది. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? మరో ప్రాణాన్ని ఎలా కాపాడాడు. తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే ఇంకెందుకాలస్యం ఫ్రెండ్స్‌.... ఈ కథనం చదివేయండి. 

డాల రాజుది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట. తండ్రి బేతయ్య, తల్లి పోశవ్వ. ఉన్న కాస్త భూమిలో వీరు వరి సాగు చేసుకొని జీవిస్తుంటారు. వీరి పెద్ద కుమారుడే రాజు. నిజాంపేట జడ్పీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తన తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు ఎప్పటిలాగే ఓ పదిహేను రోజుల క్రితం పొలానికి వెళ్లిన ఈ బాలుడు.. సాయంత్రం ఒక్కడే ఇంటికి వస్తున్నాడు. దారిలో ఉన్న మద్దిరాల చెరువుకు వచ్చేసరికి ఇరవై అయిదు సంవత్సరాల మహిళ నీళ్లలో మునిగిపోతూ కనిపించింది. అంతే ఇంకేం ఆలోచించకుండా ఒక్కసారిగా నీళ్లలోకి దూకాడు. ఒక చేతితో ఈదుతూనే మరో చేతితో ఆమెను బయటకు తీసుకొచ్చాడు. అప్పటికే నీళ్లు మింగి అపస్మారక స్థితికి చేరిన ఆమెను గ్రామస్థులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెరుగైన చికిత్స అందించడంతో ఆమె కోలుకుంది. నిజానికి ఆ మహిళ దుస్తులు ఉతికేందుకు చెరువు దగ్గరకు వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయింది. ఆమెను కాపాడటం మరికొన్ని నిమిషాలు ఆలస్యమైతే, పాపం.. ఆ మహిళ ప్రాణాలు ప్రమాదంలో పడేవే.

కష్టమైనా.. పట్టువదలక!

ఒక పక్కన తాను ఈదుతూ.. మరో పక్కన ఆ మహిళను ఒడ్డుకు చేర్చడానికి రాజు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా పట్టువదలక ఆమె ప్రాణాలు కాపాడాడు. ప్రాణాలకు తెగించి మరీ ఆమెను రక్షించినందుకు సర్పంచి, స్థానికులు, పాఠశాల ఉపాధ్యాయులు ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజును సత్కరించారు.

నాన్న చెప్పారని..

రెండేళ్ల క్రితం నాన్న సాయంతో ఈ పిల్లవాడు ఈత నేర్చుకున్నాడు. గ్రామ సమీపంలో చెరువులు ఉండటంతో.. కచ్చితంగా ఈత వచ్చి ఉండాలని రాజు తండ్రి బేతయ్య చెప్పాడు. దీంతో రాజు ఈత నేర్చుకున్నాడు. అప్పుడు నాన్న సూచన పాటించడంతో నేడు ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగాడు. ఊర్లో వాళ్లంతా మన రాజును ఇప్పుడొక రియల్‌ హీరోలా చూస్తున్నారు.

- రాజేందర్‌, ఈనాడు, సంగారెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని