టీకా వివరాలన్నీ టకాటక్‌.. చకాచక్‌!

ప్రస్తుతం మన దేశంలో ఒక్క కొవిడ్‌- 19 వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలు తప్ప.. మిగతావి ఏవీ కూడా... డిజిటల్‌ రూపంలో లేవు. అందుకే కచ్చితంగా వాటి హార్డ్‌ కాపీలను భద్రపరుచుకోవాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చాలా సార్లు ఇవి కనిపించకుండా పోతాయి. అవసరం వచ్చినప్పుడు వీటిని వెతికిపట్టుకోవడం కష్టమవుతోంది

Published : 02 Feb 2022 00:46 IST

ప్రస్తుతం మన దేశంలో ఒక్క కొవిడ్‌- 19 వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలు తప్ప.. మిగతావి ఏవీ కూడా... డిజిటల్‌ రూపంలో లేవు. అందుకే కచ్చితంగా వాటి హార్డ్‌ కాపీలను భద్రపరుచుకోవాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చాలా సార్లు ఇవి కనిపించకుండా పోతాయి. అవసరం వచ్చినప్పుడు వీటిని వెతికిపట్టుకోవడం కష్టమవుతోంది. 15 ఏళ్ల అబ్బాయి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కనిపెట్టాడు. దాని కోసం ఏకంగా యాప్‌నే సృష్టించాడు.

బెంగళూరుకు చెందిన లక్ష్ భరణి ప్రస్తుతం నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 11వ గ్రేడ్‌ చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఈ మధ్య ఫ్లూ వ్యాక్సిన్‌ వేయించుకున్నాడు. దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. అప్పుడే అతడికి దాన్ని డిజిటలైజ్‌ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. దాని ప్రతిఫలమే వ్యాక్సిచెక్‌ యాప్‌. ఇది జనవరిలో లాంచ్‌ అయింది. ఇందులో వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు జీవితకాలం భద్రపరుచుకోవచ్చు. ఈ యాప్‌లో హెపటైటిస్‌ ఎ, బి, మీజిల్స్‌, ఇన్‌ఫ్లూయెంజా, కొవిడ్‌-19 ఇలా అన్ని వ్యాక్సినేషన్ల వివరాలతో పాటు, వ్యక్తిగత మెడికల్‌ రికార్డ్స్‌ కూడా ఎంచక్కా పొందుపరుచుకోవచ్చు.

నాలుగు నెలల కష్టం..
యాప్‌ రూపొందించాలన్న ఆలోచన వచ్చిన తర్వాత భరణి దీని మీద దాదాపు నాలుగు నెలలు కసరత్తు చేశాడు. ఈలోపు ఖాళీగా ఉండకుండా కంప్యూటర్‌ కోడింగ్‌, లాంగ్వేజెస్‌ నేర్చుకున్నాడు. టెక్నికల్‌గా ఆరితేరిన తర్వాత సొంతంగా ఈ వ్యాక్సిచెక్‌ యాప్‌ను తయారు చేశాడు.

చిత్రాలు తీసి..
మెడికల్‌ రికార్డ్స్‌, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లను స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీసి ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. వ్యాక్సినేషన్‌ పత్రాలు ఇలా పక్కాగా ఉంటే.. వ్యాక్సిన్లు వేయించుకోవడం మర్చిపోవడం, మర్చిపోయి.. రెండుసార్లు వేయించుకోవడం లాంటివి జరగవు అంటున్నాడు మన భరణి. మొత్తానికి ఇంత చిన్న వయసులోనే అంత దూరదృష్టి ఉండటం, ఏకంగా ఓ యాప్‌నే రూపొందించడం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని