పట్టుదలే ఒడ్డుకు చేర్చింది!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు నీళ్లన్నా ఈత కొట్టడమన్నా భలే సరదా కదూ! కానీ, ఓ అన్నయ్య మాత్రం.. తనకు చేతులు లేకపోయినా పట్టుదలతో ఈత నేర్చుకొని మరీ పెరియార్‌ నదిని ఈదాడు తెలుసా! ఆ నేస్తం వివరాలేంటో చదవండి మరి..

Published : 07 Feb 2022 00:24 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు నీళ్లన్నా ఈత కొట్టడమన్నా భలే సరదా కదూ! కానీ, ఓ అన్నయ్య మాత్రం.. తనకు చేతులు లేకపోయినా పట్టుదలతో ఈత నేర్చుకొని మరీ పెరియార్‌ నదిని ఈదాడు తెలుసా! ఆ నేస్తం వివరాలేంటో చదవండి మరి..

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన 15 ఏళ్ల మహమ్మద్‌ ఆసిమ్‌కు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. ఒక కాలు సరిగా పనిచేయదు. ఒక చెవి కూడా స్పష్టంగా వినపడదు. ఓ నది ఒడ్డునే అతడి ఇల్లు ఉండటంతో చిన్నతనం నుంచే ఎలాగైనా అందులో ఈత కొట్టాలని అనుకునేవాడు.

శిక్షణ తీసుకొని మరీ..

దివ్యాంగుడైన తాను మామూలుగా ఈత కొట్టడమే కష్టం.. అదీ నదిలో అంటే అసాధ్యమనీ బాధపడుతుండేవాడు. కానీ, ఎలాగైనా తాను అనుకున్నది సాధించాలనే పట్టుదలతో.. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఈత నేర్పించే సాజీ అనే శిక్షకుడి దగ్గర చేరాడు. సాధారణంగా రోజుకు గంట మాత్రమే ఈత నేర్పించే ఆయన... ఆసిమ్‌ పట్టుదల చూసి ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు శిక్షణ ఇచ్చేవాడు. అలా కేవలం రెండు వారాల్లోనే నైపుణ్యం సాధించాడు.

ప్రవాహానికి ఎదురీదుతూ..

నేర్చుకోవడం వేరు.. అవరోధాలను అధిగమిస్తూ మనం నేర్చుకున్న అంశాలను ఆచరణలో చూపడం వేరు. ఆసిమ్‌కూ అదే పరిస్థితి ఎదురైంది. కిలోమీటరు వెడల్పు ఉన్న పెరియార్‌ నదిని శిక్షకుడితో కలిసి కేవలం గంటలోనే ఈది అందరినీ అబ్బురపరిచాడు. అలా అని అతడి సాహసం ‘నల్లేరు మీద నడక’లా ఏమీ సాగలేదు. నది మధ్యలో కొన్ని చోట్ల ప్రవాహ వేగం పెరిగినా... అత్యంత లోతైన ప్రదేశంలో ఏమాత్రం భయపడకుండా వంద శాతం శక్తిసామర్థ్యాలు ఉపయోగించాడట.

ఫౌండేషన్‌తో సేవ

దివ్యాంగులూ నాలుగు గోడలకే పరిమితం కానవసరం లేదనీ, సమాజంలో అందరిలాగానే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలనీ చెబుతున్నాడు ఆసిమ్‌. అంతే కాదండోయ్‌... దివ్యాంగుల కోసం ‘ఆసిమ్‌ వెలిమన్న’ పేరిట ప్రత్యేకంగా ఓ ఫౌండేషన్‌నూ ప్రారంభించాడీ నేస్తం. స్వల్పకాల శిక్షణతోనే తాను అనుకున్నది సాధించిన ఈ అన్నయ్య నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని