దేవాన్ష్‌.. జ్ఞాపకశక్తిలో భేష్‌!

రెండేళ్ల వయసంటే.. మనకు బుడి బుడి అడుగులు.. తడబడే మాటలు... గుర్తుకు వస్తాయి. కానీ ఆ వచ్చీరానీ మాటలతోనే ఓ బుడతడు, అందరూ ‘ఔరా!’ అని అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా బుడత? తెలుసుకోవాలని ఉందా?! అయితే

Published : 08 Feb 2022 01:33 IST

రెండేళ్ల వయసంటే.. మనకు బుడి బుడి అడుగులు.. తడబడే మాటలు... గుర్తుకు వస్తాయి. కానీ ఆ వచ్చీరానీ మాటలతోనే ఓ బుడతడు, అందరూ ‘ఔరా!’ అని అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా బుడత? తెలుసుకోవాలని ఉందా?! అయితే ఇంకేం.. ఈ కథనం చదివేయండి ఫ్రెండ్స్‌!

కోచికి చెందిన ఆత్మిక్‌ అమల్‌ దేవాన్ష్‌ చాలా చురుకు. ‘మిగతా పిల్లలతో పోల్చుకుంటే తన బాబులో ఏదో ప్రత్యేకత ఉంది’ అని మొదట దేవాన్ష్‌ వాళ్ల నాన్న గుర్తించారు. ఎలా అంటే... పెద్దవాళ్ల హావభావాలను పసి వయసులోనే దేవాన్ష్‌ అనుకరించేవాడట! ఏడాది వయసు వచ్చేసరికి తమ పిల్లాడికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని ఆ దంపతులు గ్రహించారు.

నాన్న నేర్పారు..

దేవాన్ష్‌ వాళ్ల నాన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా విషయాలు చెప్పాడు. రంగు రంగు పుస్తకాలు ముందుంచి జంతువులు, వాహనాలు, కట్టడాల పేర్లను నేర్పించాడు. అలాగే తన కారులోని భాగాల గురించీ చెప్పాడు. ఇవన్నీ మన దేవాన్ష్‌ ఇట్టే ఒంట బట్టించుకున్నాడు. 400 పైచిలుకు పదాలు నేర్చుకున్నాడు. వీటన్నింటినీ మళయాళం, ఇంగ్లిష్‌, హిందీలో చెప్పేయగలడు.

నానమ్మ సూచనతో..  

దేవాన్ష్‌ వాళ్ల నానమ్మ సూచనతో.. ఇంట్లో వాళ్లు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వాళ్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వాళ్లు పరీక్షించారు. చిన్నారి దేవాన్ష్‌.. పక్షులు, జంతువులు, సంఖ్యలు, పండ్లు, వ్యక్తుల పేర్లను చెప్పేశాడు.

‘K’ పలక లేక!

పాపం ఎంతైనా దేవాన్ష్‌ చిన్నపిల్లోడు కదా! కొన్ని కొన్ని అక్షరాలు సరిగా పలకడం రాదు. ముఖ్యంగా ‘ఁ’ అక్షరం. అందుకే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వాళ్లు కేవలం 250 పదాలను మాత్రమే గుర్తించారు. అన్నట్లు మీకో విషయం తెలుసా?! ఈ మధ్యే తన రెండో పుట్టినరోజునాడు అమ్మానాన్న నుంచి చిన్న జిప్సీని కూడా బహుమతిగా పొందాడు. ప్రస్తుతం దానిలో చక్కర్లు కొడుతూ రోజూ ఆడుకుంటున్నాడు. అంతేకాదు ఫ్రెండ్స్‌.. ఈ బుజ్జి బుడత ఓ సినిమాలోనూ నటించాడు. అతడి మొదటి పుట్టినరోజు వేడుకలు ఆ సినిమా సెట్‌లోనే జరిగాయట! మొత్తానికి దేవాన్ష్‌ గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని