చకచకా సముద్రాన్ని ఈదేసింది!

ఓ ఎనిమిదేళ్ల పాప.. సముద్రాన్ని చేపలా చకచకా ఈదేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా 19 కిలోమీటర్లు ఏకబిగిన ఈదేసింది. ఇదంతా ఓ మంచిపని కోసం చేసింది. ఇంతకీ ఎవరా పాప? ఏంటా

Published : 05 Feb 2023 16:10 IST

ఓ ఎనిమిదేళ్ల పాప.. సముద్రాన్ని చేపలా చకచకా ఈదేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా 19 కిలోమీటర్లు ఏకబిగిన ఈదేసింది. ఇదంతా ఓ మంచిపని కోసం చేసింది. ఇంతకీ ఎవరా పాప? ఏంటా మంచి పని? తెలుసుకోవాలని ఉంది కదూ..!

మిళనాడుకు చెందిన ఆరాధనకు సముద్రం అంటే చాలా ఇష్టం. కానీ రోజురోజుకూ సముద్రాల్లో పెరుగుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఈ చిన్ని హృదయాన్ని కలచివేశాయి. సముద్రం గొప్పదనాన్ని, పర్యావరణ సమతౌల్యంలో దాని ప్రాముఖ్యాన్ని చాటి చెప్పాలనుకుంది. కానీ నోటితో కాదు... తన ఈతతో!

రామేశ్వరంలో తెలిసింది...
మన ఆరాధన నాన్న అరవింద్‌. ఆయన స్కూబా డైవింగ్‌ శిక్షకుడు. ఆరాధన కూడా స్కూబా డైవింగ్‌ నేర్చుకుంది. తాను మొట్టమొదటిసారిగా రామేశ్వరంలో స్కూబాడైవింగ్‌ చేసినప్పుడే సముద్రంలో ఎంతగా ప్లాస్టిక్‌ పేరుకుపోతోందో గమనించింది. ప్రజలకు దీని మీద అవగాహన కల్పించి సముద్రాన్ని, సముద్ర జీవులను ప్లాస్టిక్‌ బారి నుంచి కాపాడాలనుకుంది. అందుకే ఇటీవల ఈ చిన్నారి కోవలం నుంచి నీలంకరై వరకు 19 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరుగంటల పద్నాలుగు నిమిషాల్లోనే ఈదేసింది.

ఎన్నో కష్టాలకోర్చి...
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈత సమయంలో ఆరాధనకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. సముద్ర జలాలు చాలా చల్లగా ఉండటం వల్ల కండరాలు బిగుసుకుపోయాయి. పలు ఆరోగ్య సమస్యలూ వచ్చాయి. అయినా వెనకడుగు వేయలేదు. ముందు 18 కిలోమీటర్లు అనుకున్నప్పటికీ 19కిలోమీటర్లు ఈది.. సముద్రం మీద తనకున్న ఇష్టాన్ని చాటుకుంది. అదే సమయంలో మనమందరమూ సముద్రాన్ని ప్లాస్టిక్‌ బారి నుంచి కాపాడుకోవాలన్న సందేశాన్నీ ఇచ్చింది. నిజంగా ఆరాధన గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని