వేళ్లలోనే మాయ!

మృదంగం మన సంప్రదాయ సంగీత వాయిద్యం.. దీని మీద ప్రావీణ్యం అందరికీ రాదు.. ఎంతో నేర్పు, ఓర్పు ఉంటేనే సాధ్యం.. కానీ ఓ బుడతడు మాత్రం ఈ కళలో దూసుకుపోతున్నాడు. అందరూ

Published : 13 Feb 2022 00:18 IST

మృదంగం మన సంప్రదాయ సంగీత వాయిద్యం.. దీని మీద ప్రావీణ్యం అందరికీ రాదు.. ఎంతో నేర్పు, ఓర్పు ఉంటేనే సాధ్యం.. కానీ ఓ బుడతడు మాత్రం ఈ కళలో దూసుకుపోతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు!

కేరళలోని అంగడిపురానికి చెందిన దేవీ ప్రసాద్‌కు 14 సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తనకు ఆరేళ్ల వయసున్నప్పటి నుంచే మృదంగం నేర్చుకోవడం ప్రారంభించాడు. పిల్లలకు ప్రసాద్‌ వాళ్ల నాన్న మృదంగం నేర్పేవారు. చిన్నప్పటి నుంచి అది చూసి ప్రసాద్‌కు కూడా మృదంగం అంటే ఇష్టం ఏర్పడింది. ఇంకేముంది ఈ బుడతడి నాన్న.. ఇతడికి కూడా నేర్పించాడు. ప్రస్తుతం మరో గురువు దగ్గర శిష్యరికం చేస్తున్నాడు.

రోజూ మూడు గంటలు సాధన...

తడబడే బుడిబుడి అడుగుల వయసు నుంచే దేవీ ప్రసాద్‌ పలు ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. వాళ్లను తన ప్రతిభతో మైమరిచిపోయేలా చేశాడు. ఏడో ఏట తన అరంగేంట్రం శ్రీ తిరుమంధంకున్ను భగవతి ఆలయంలో చేశాడు. అప్పటి నుంచి నిత్యం తనను తాను మెరుగుపరుచుకుంటూ తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటున్నాడు. రోజూ కచ్చితంగా మూడు గంటలు సాధన చేయాల్సిందే.

ఎన్నెన్నో ప్రశంసలు!

ప్రసాద్‌ ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చి, చక్కటి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా గురువయూర్‌ చెంబై సంగీతోత్సవం- 2021, కోజికోడ్‌ త్యాగరాయ సంగీత కార్యక్రమంలో ప్రసాద్‌ ప్రదర్శనకు మంచి గుర్తింపొచ్చింది. 2018లో అలువ సంగీత సభ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మృదంగం పోటీల్లో ప్రథమ బహుమతి సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ప్రధాన్‌మంత్రి రాష్ట్రీయ బాలపురస్కారాన్నీ కైవసం చేసుకున్నాడు. చిన్న వయసులోనే ఇవన్నీ సాధించిన మన మన దేవీ ప్రసాద్‌ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని