పుస్తకం రాసి.. లైబ్రరీలో దాచేశాడు!

హాయ్‌ ఫ్రెండ్స్‌! హోంవర్క్‌ అంటేనే గడగడలాడిపోతుంటాం. ఎవరైనా ఏదైనా రాయమంటేనో బొమ్మ గీయమంటేనో బోలెడు ఇబ్బంది పడుతుంటాం. టీచర్‌ కోప్పడతారనో ఇంట్లో తిడతారనో ఇక తప్పక గబగబా చేసేస్తుంటాం. కానీ, ఒక నేస్తం మాత్రం చిన్నతనంలోనే ఏకంగా పుస్తకమే రాసేశాడట. ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి..!

Updated : 14 Feb 2022 08:50 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! హోంవర్క్‌ అంటేనే గడగడలాడిపోతుంటాం. ఎవరైనా ఏదైనా రాయమంటేనో బొమ్మ గీయమంటేనో బోలెడు ఇబ్బంది పడుతుంటాం. టీచర్‌ కోప్పడతారనో ఇంట్లో తిడతారనో ఇక తప్పక గబగబా చేసేస్తుంటాం. కానీ, ఒక నేస్తం మాత్రం చిన్నతనంలోనే ఏకంగా పుస్తకమే రాసేశాడట. ఆ వివరాలేంటో తెలుసుకుందామా మరి..!

మెరికాలోని ఇడాహో నగరానికి చెందిన డిల్లాన్‌ హెల్బిగ్‌ అనే బాలుడికి ఎనిమిదేళ్లు. ఎలాగైనా పే..ద్ద రచయిత కావాలనేది అతడి లక్ష్యం. అయితే, గత డిసెంబరులో క్రిస్మస్‌ సందర్భంగా ఆ బాలుడి సాహసాలు, సెలవులు గడిపిన తీరుతో పాటు అల్లరి పనులను వివరిస్తూ.. 88 పేజీలతో ఒక పుస్తకం రాశాడు. అలాగని అన్నీ అక్షరాల్లోనేనని అనుకోకండి.. బొమ్మలతో సహా తన సృజనాత్మకతను బయటపెట్టాడీ బాలుడు. దానికి ‘ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ డిల్లాన్‌ హెల్బిగ్స్‌ క్రిస్మస్‌’ అని పేరూ పెట్టాడు.

దాచినా.. బయటకు వచ్చేసింది

తను రాసిన పుస్తకాన్ని హెల్బిగ్‌.. ఎవరికీ తెలియకుండా, ఇంటికి సమీపంలో ఉన్న ఓ లైబ్రరీలోని షెల్ఫుల మధ్యలో దాచేశాడు. కొన్ని రోజుల తర్వాత లైబ్రరీకి వచ్చేవాళ్లు ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే... బాలుడి బుక్‌ కనిపించింది. ఇంకేముంది... ‘ఆ పుస్తకమేంటో?’, ‘దాని వెనకున్న కథేంటో?’ అని అందరిలో ఆసక్తి కలిగింది. దాంతో ఆ గ్రంథాలయ నిర్వాహకులు బుడ్డోడు రాసిన బుక్‌ను లైబ్రరీ పుస్తకాల జాబితాలోనూ చేర్చేశారు.

వెయిటింగ్‌ లిస్టు ఉందట

ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని అధికారికంగా లైబ్రరీ జాబితాలో చేర్చారో ఇక అప్పటినుంచి దాన్ని చదివేందుకు పోటీ ఎక్కువైందట. ఎంతలా అంటే, గత వారం దాదాపు 100 మంది వరకూ ఆ పుస్తకం చదివేందుకు తమ పేర్లు నమోదు చేసుకునేంతలా! ఈ విషయం తెలియడంతో బాలుడి తల్లిదండ్రుల ఆనందానికి హద్దుల్లేవట.

ముద్రణకూ ముందుకు..

హెల్బిగ్‌ పుస్తకం వైరల్‌గా మారడంతో అక్కడి ప్రచురణకర్తలు దాన్ని పబ్లిష్‌ చేస్తామని ముందుకొస్తున్నారు. అంటే, పెద్దయ్యాక పేరున్న రచయిత కావాలనుకున్న మన హెల్బిక్‌... ఎనిమిదేళ్లకే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడన్నమాట. అందుకే, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉండాలని, దాని సాకారానికి నిరంతరం కష్టపడాలని పెద్దలు చెబుతుంటారు. ఎంతైనా, ఈ డిల్లాన్‌ హెల్బిగ్‌ గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు