గూగుల్‌లో శోధన.. యూట్యూబ్‌తో ఆవిష్కరణ!

హాయ్‌ నేస్తాలూ! బడి నుంచి ఇంటికొచ్చాక మనమంతా సెల్‌ఫోన్లో ఆటలతోనో టీవీ చూస్తూనో సరదాగా గడిపేస్తాం. కానీ, పన్నెండేళ్ల ఓ బాలుడు మాత్రం రకరకాల హార్డ్‌వేర్‌ పరికరాలతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాడు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి

Published : 16 Feb 2022 00:35 IST

హాయ్‌ నేస్తాలూ! బడి నుంచి ఇంటికొచ్చాక మనమంతా సెల్‌ఫోన్లో ఆటలతోనో టీవీ చూస్తూనో సరదాగా గడిపేస్తాం. కానీ, పన్నెండేళ్ల ఓ బాలుడు మాత్రం రకరకాల హార్డ్‌వేర్‌ పరికరాలతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాడు. సమాజంలోని సమస్యల పరిష్కారానికి సరికొత్త యంత్రాలు కనిపెడుతుంటాడు. ఆ మిత్రుడి గురించి తెలుసుకుందాం రండి.!

మిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడికి చెందిన షాఘిల్‌ ఇజాజ్‌ ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. పాఠశాల అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే... వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, చిప్స్‌, సర్క్యూట్‌ బోర్డులు, బ్లూటూత్‌ స్పీకర్లు చుట్టూ వేసుకొని వాటితో రకరకాల ప్రయోగాల్లో నిమగ్నమవుతుంటాడు.  

ఆన్‌లైన్‌ క్లాసులకు ఫోన్‌ కొన్నాక...

రెండేళ్ల క్రితం ఆన్‌లైన్‌ క్లాసుల కోసం ఇజాజ్‌కి వాళ్ల నాన్న సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అప్పటినుంచి అతడికి అదే ప్రపంచంగా మారింది. స్నేహితులందరూ ఫోన్లో ఆటలాడుతుంటే.. ఇజాజ్‌ మాత్రం గూగుల్‌లో ‘ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎలా పనిచేస్తాయి?’, ‘వాటిలో వినియోగించే సాంకేతికత ఏంటి?’ - ఇలా తదితర అంశాలపై సమాచారం సేకరించేవాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ఆ పరికరాలతో ఆవిష్కరణలకు సిద్ధమయ్యాడు.

అంధులకు ఉపయోగకరంగా..

కేవలం ఇంటర్నెట్‌ మీద ఆధారపడి అంధులకు ఉపయోగపడేలా ఒక ఊత కర్రను కనిపెట్టాడు ఇజాజ్‌. ప్లాస్టిక్‌ పైపు, సెన్సార్‌, ఇతర సామగ్రితో తయారు చేసిన ఈ పరికరానికి మూడు వేల రూపాయలు ఖర్చు చేశాడట. బాలుడి పనితనాన్ని స్వయంగా చూసిన ఓ ఫౌండేషన్‌ ప్రతినిధులు, అల్యూమినియంతో ఓ స్మార్ట్‌ స్టిక్‌ను తయారు చేసి ఇవ్వాలని కోరారట.

బస్సు డ్రైవర్ల కోసం..

డ్రైవర్ల నిద్రమత్తే బస్సు ప్రమాదాలకు కారణమని తెలుసుకున్న ఇజాజ్‌, అందుకు ఏదైనా పరిష్కారం కనుగొనాలనుకున్నాడు. విధుల్లో ఉన్నప్పుడు నిద్రతో డ్రైవర్ల కళ్లు మూతబడితే వెంటనే అలర్ట్‌ చేసేలా ఓ పరికరాన్ని తయారు చేసే పనిలో ప్రస్తుతం ఉన్నాడీ బాలుడు. ‘చిన్నప్పటి నుంచి ఇజాజ్‌కు పోలీసు కావాలని ఉండేది. లాక్‌డౌన్‌ తర్వాత తన లక్ష్యం మారిపోయింది. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది’ అని వాళ్ల అమ్మ మదీనా చెబుతోంది. పేద కుటుంబం కావడంతో ఆమె టీకొట్టు నడుపుతూ వచ్చే ఆదాయంలో కొంత మొత్తంతో ఇజాజ్‌కు అవసరమైన పరికరాలు కొనిస్తుంటుంది.

ఇతర రంగాల్లోనూ ప్రతిభ

తనకు సైన్స్‌ అంటే ఇష్టమని, పెద్దయ్యాక ఆ రంగంలోనే స్థిరపడాలని ఇజాజ్‌ లక్ష్యమట. తనకు సింబలం, యోగా, కరాటే, తైక్వాండో కూడా తెలుసనీ, ఇదివరకే ఏడు కిలోమీటర్ల మారథాన్‌నూ పూర్తి చేశానని చెబుతున్నాడు. ఇజాజ్‌ ప్రతిభకు గుర్తింపుగా మొన్న జనవరి 26న పాఠశాలలో ప్రశంసాపత్రాన్ని కూడా అందజేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని