Published : 17 Feb 2022 00:24 IST

పిల్లలు.. పర్యావరణహితులు!

హలో ఫ్రెండ్స్‌! ‘పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు’, ‘పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ’ అనే మాటలను పుస్తకాల్లో చదివే ఉంటారు. టీవీల్లోనూ వినుంటారు. కొన్ని బడుల ఆవరణల్లో విద్యార్థులే ఉద్యానవనాలతోపాటు కూరగాయలు, ఆకుకూరల మొక్కలూ పెంచుతున్నారు. ఈ పాఠశాల విద్యార్థులూ పచ్చదనాన్ని పరిరక్షిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు.

బెంగళూరులోని భత్తరహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుంచి పదోతరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు తలా రెండు మొక్కలను దత్తత తీసుకున్నారు. బడి ఎదురుగా ఉన్న చెరువుకు సంబంధించిన 21 ఎకరాల స్థలంలో స్థానికులు, కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి మొత్తం 900 మొక్కలు నాటారు. పాఠశాల పిల్లలు వాటిలో తలా రెండుమొక్కలను దత్తతగా తీసుకున్నారు. ప్రతి రోజూ ఇంటి నుంచి బాటిళ్లలో నీరు తీసుకొచ్చి మొక్కలకు పోస్తున్నారు. ఉపాధ్యాయులూ తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తుండంటంతో పిల్లలూ ఉత్సాహంగా పచ్చదనం పెంపులో భాగస్వాములవుతున్నారు.

మరో పాఠశాల విద్యార్థులూ...

భత్తరహళ్లి పాఠశాల విద్యార్థుల చొరవను స్ఫూర్తిగా తీసుకొని, బృహత్‌ బెంగళూరు మహానగర పాలక(బీబీఎంపీ) స్కూల్‌ నుంచి 90 మంది చిన్నారులూ గత వారం నుంచి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెరువులకు సంబంధించిన స్థలాల్లో పచ్చదనం పెంపొందించడం, సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను వాటి పరిరక్షణలో భాగస్వాములను చేయడం 2019లోనే ప్రారంభమైంది. ఏటా అదనంగా కొన్ని పాఠశాలలు ఈ జాబితాలోకి చేరుతున్నాయి. ఈ పిల్లలను అక్కడి వారంతా ‘ప్లాంట్‌ కేర్‌టేకర్లు’గా పిలుస్తున్నారట. చెట్లుంటేనే వర్షాలనీ, అప్పుడే పాడిపంటలు బాగుంటాయనీ, కరవుకాటకాలు దరిచేరవనీ చాటుతున్నారు. అందుకే, మనమూ ఈ చిన్నారులను అభినందించడంతోపాటు వారి నుంచి స్ఫూర్తి పొంది ఆచరణలోనూ చూపాలి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని