Published : 19 Feb 2022 01:01 IST

సముద్రాల్లో దూకేస్తా.. ప్లాస్టిక్‌ను ఏరేస్తా!

పిల్లలూ.. మనందరికీ నీళ్లంటే బోలెడు ఇష్టం కదా!  పెద్ద పెద్ద బావులన్నా.. హోరున ప్రవహించే నదులన్నా.. సముద్రాలన్నా చెప్పలేనంత భయం కూడానూ! ఒక నేస్తం మాత్రం పెద్ద పెద్ద సముద్రాలనే ఈదేస్తూ.. అందులోని ప్లాస్టిక్‌ను ఏరేస్తోంది. ఇంతకీ తనెవరో, ఎందుకలా చేస్తుందో, ఆ కథేంటో చదివేయండి మరి!

చెన్నైకి చెందిన ఎనిమిదేళ్ల థారగై స్కూబా డైవర్‌. ‘ఏంటి ఇంత చిన్న వయసులోనా?’ అని ఆశ్చర్యపోకండి. అయిదేళ్ల వయసు నుంచే డైవింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇంతకీ ఆ ఆసక్తి ఎలా వచ్చిందంటే - థారగై వాళ్ల నాన్న అరవింద్‌ గత 20 ఏళ్లుగా స్కూబా డైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడట. అలా చిన్నతనం నుంచి కూతురికి నీళ్లంటే భయం పోగొట్టడంతో పాటు మూడేళ్లకే ఈదటం కూడా నేర్పించాడాయన. పిల్లలకు ఈత తప్పకుండా రావాలనీ, రోజూ ఉదయాన్నే తనతో పాటు సాధనకు తీసుకెళ్లేవాడు. అలా బుడి బుడి అడుగుల వయసులోనే తనకు సముద్రంతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో బీచ్‌ల వెంట ఉండే ప్లాస్టిక్‌ వ్యర్థాలను తండ్రి ఏరుతూ ఒకచోట పోగు చేయడం గమనించిందా చిన్నారి.

సముద్ర జీవుల గురించి..

ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న థారగై.. డైవింగ్‌ చేసే క్రమంలో సముద్రంలో కలిసే ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. అందులోని జీవరాశులకు ఎంత హాని కలిగిస్తున్నాయో ప్రత్యక్షంగా చూసింది. దాంతో అప్పటినుంచి డైవింగ్‌లో భాగంగా సముద్రం అడుగు భాగాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను ఏరివేయడం బాధ్యతగా తీసుకుంది.

తండ్రితో కలిసి..

చెన్నైను ఆనుకొని ఉన్న సముద్రంతో పాటు బీచ్‌ల వెంబడి చిన్నారి తండ్రి ఇప్పటివరకూ 10,000 కేజీల ప్లాస్టిక్‌ను సేకరించాడట. అంతే కాదండోయ్‌.. తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి దాదాపు 600 కేజీల ప్లాస్టిక్‌ బాటిళ్లను పోగుచేశారు. ఆ వ్యర్థాలను చెత్త రీసైక్లింగ్‌ చేసే ఏజెన్సీలకు విక్రయించి, వచ్చిన సొమ్మును తమిళనాడు ప్రభుత్వ పర్యావరణ శాఖకు అప్పగించనున్నారట.

అవగాహన కల్పిస్తూ..

ప్లాస్టిక్‌తో మానవాళికి పొంచి ఉన్న ముప్పుతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందీ చిన్నారి. పాఠశాలలో తోటి విద్యార్థులనూ ఇందులో భాగస్వాములను చేస్తుంది. సముద్రజీవుల మనుగడకూ తనవంతు కృషి చేస్తానంటుంది థారగై. ఇటీవలే తండ్రి వెంట రాగా, ‘సేవ్‌ ది ఓషన్‌’ నినాదంతో సముద్రంలో 18 కిలోమీటర్ల దూరం ఈతకొట్టి రికార్డూ సాధించింది. ఈ వయసులోనే చిన్నారి పర్యావరణ స్పృహ చూస్తే, గ్రేట్‌ అనిపిస్తోంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని