Updated : 20 Feb 2022 06:16 IST

భయం పోగొట్టేలా.. నైపుణ్యాలు పెరిగేలా..

హాయ్‌ ఫ్రెండ్స్‌! క్లాసులో టీచర్‌ పిలిచి ఏదైనా అంశంపై స్పీచ్‌ ఇవ్వమంటే భయపడిపోతాం. ఇంటికి ఎవరైనా బంధువులొస్తే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక లోపలకు వెళ్లి దాక్కుంటాం. పిల్లల్లో అలాంటి భయాలను పోగొట్టడంతోపాటు నైపుణ్యాలనూ పెంచేందుకు కర్ణాటక రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. అదేంటో తెలుసుకుందామా!

బెడ్రబెట్టు నగరంలోని ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో పట్టణ ప్రాంతాల వారేగాక, చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చేవారూ ఉన్నారు. పట్టణానికి చెందిన వారితో పోల్చుకుంటే గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు తరగతిలో ఏమైనా మాట్లాడాలన్నా, ఏదైనా ప్రశ్న అడగాలన్నా ఇబ్బంది పడేవారట. సాయంత్రం ఆటల్లోనూ అంతగా ఆసక్తి చూపేవారు కాదట. ఈ పరిస్థితిని గమనించిన పాఠశాల నిర్వాహకులు.. అలాంటి విద్యార్థుల్లో భయం పోగొట్టేలా ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రసారమయ్యే అంశాలు అన్ని తరగతి గదుల్లో వినిపించేలా బడి మొత్తం స్పీకర్లూ అమర్చారు. 

పాటలూ.. జోకులూ..

ఈ రేడియో స్టేషన్‌కు సంబంధించిన మైక్‌ను స్కూల్‌ కారిడార్‌లో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ లంచ్‌ బ్రేక్‌లో విద్యార్థులు తాము నేర్చుకున్న పాటలు కానీ తెలిసిన జోక్స్‌ కానీ పద్యాలూ జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలూ లేకపోతే ఏదైనా విషయం గురించో 15 నిమిషాలపాటు మాట్లాడొచ్చు. ‘మరి అందరూ ఒకేసారి వస్తే ఎలా?’ అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే, అక్కడి ఉపాధ్యాయులు తరగతుల వారీగా విద్యార్థులకు కొన్ని స్లాట్లు కేటాయిస్తుంటారు. తమ వంతు ఎప్పుడెప్పుడొస్తుందా అని విద్యార్థులు హుషారుగా ఎదురుచూస్తుంటారు. వారికి అవకాశం రాగానే గబగబా తమకు తెలిసిన విషయాలను పంచుకుంటుంటారు. 

విద్యార్థుల్లో స్పష్టమైన మార్పు

రేడియో స్టేషన్‌తో విద్యార్థుల్లో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెరిగాయనీ, ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే మిగతా వారంతా వింటుండటంతో గ్రహణశక్తీ మెరుగుపడుతోందని ఉపాధ్యాయులూ తల్లిదండ్రులూ చెబుతున్నారు. ఇంటి దగ్గరా, బడిలో సమయాన్ని వృథా చేయకుండా పిల్లలు ఈ రేడియో స్టేషన్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నారట.

మనమూ ప్రయత్నించొచ్చు

మీ పాఠశాలల్లో అలాంటి స్టేషన్‌ లేకపోయినా.. ఇంట్లోనే అలా ప్రాక్టీస్‌ చేయొచ్చు. ఎలాగంటే, అద్దం ముందు నిల్చొని ఏదైనా విషయం మీద ఒక పది నిమిషాలపాటు మాట్లాడండి.  మీలోని లోపాలను సరిదిద్దుకుంటూ క్రమక్రమంగా అలా స్టేజ్‌ భయాన్ని పోగొట్టుకోవచ్చు. మాట్లాడాలనుకున్న అంశంపై అంతకుముందే కొంత కసరత్తు చేస్తాం కాబట్టి విషయ పరిజ్ఞానమూ పెరుగుతుంది. ఇంకెందుకాలస్యం.. మీరూ ప్రయత్నించండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని