బొమ్మలతో కథలు.. బోలెడు ప్రశంసలు

హాయ్‌ నేస్తాలూ! ఇంట్లోనో బడిలోనో ఎవరైనా రంగులు నింపమని బొమ్మల చార్టులు ఇస్తే ఏం చేస్తాం? - క్షణం ఆలస్యం చేయకుండా బ్యాగ్‌లోంచి స్కెచ్‌ పెన్నులూ క్రేయాన్సూ తీసి చకాచకా రంగులు నింపేస్తాం కదా! కానీ, ఓ నేస్తం మాత్రం ఆ బొమ్మలను మళ్లీ ఒక ఛార్టుపైన గీసి.. ఆ తరవాత రంగులు నింపుతాడట. ఆ అలవాటే అతడిని బుల్లి రచయితను కూడా చేసింది. ఆ వివరాలేంటో చదివేద్దామా మరి!

Published : 21 Feb 2022 00:55 IST

హాయ్‌ నేస్తాలూ! ఇంట్లోనో బడిలోనో ఎవరైనా రంగులు నింపమని బొమ్మల చార్టులు ఇస్తే ఏం చేస్తాం? - క్షణం ఆలస్యం చేయకుండా బ్యాగ్‌లోంచి స్కెచ్‌ పెన్నులూ క్రేయాన్సూ తీసి చకాచకా రంగులు నింపేస్తాం కదా! కానీ, ఓ నేస్తం మాత్రం ఆ బొమ్మలను మళ్లీ ఒక ఛార్టుపైన గీసి.. ఆ తరవాత రంగులు నింపుతాడట. ఆ అలవాటే అతడిని బుల్లి రచయితను కూడా చేసింది. ఆ వివరాలేంటో చదివేద్దామా మరి!

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన ఆదిత్యా అయ్యర్‌కు పదేళ్లు. అతడికి చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే భలే సరదా. ఎంతలా అంటే, రంగులు నింపమని చార్టులు తీసుకొస్తే.. అవే బొమ్మలను మళ్లీ ఇంకో చార్టుపై గీసి మరీ కలర్లు దిద్దేవాడట. ఆ ఆసక్తి కాస్త కొన్నేళ్ల క్రితం హాజరైన ఓ వర్క్‌షాప్‌తో ఇష్టంగా మారింది. అక్కడ బొమ్మలు గీయడంతో పాటు వాటితో కథలు చెప్పడమూ నేర్చుకున్నాడు ఆదిత్య.

బంధువులూ కోరడంతో..

మొదటిసారిగా ఆది, రామ్‌, నిధి అనే కల్పిత పాత్రలతో బొమ్మల రూపంలో దళసరి కాగితాలపై ఓ కథను తయారు చేశాడు ఆదిత్య. గుర్తుగా దాచిపెట్టుకుందామని, వాళ్ల నాన్న దాన్ని ప్రింట్‌ చేయించి ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని చూసిన బంధువులూ, నాన్న స్నేహితులూ మాకూ ఓ పుస్తకం కావాలని కోరడంతో పబ్లిష్‌ చేయిద్దామని ఓ ప్రెస్‌కు వెళ్తే ‘చిన్నపిల్లల బొమ్మలను ఎవరైనా పబ్లిష్‌ చేస్తారా?’ అని తిరస్కరించాట. దాంతో ఆదిత్య వాళ్ల నాన్నే సొంతంగా ఓ పబ్లిషర్స్‌ను ప్రారంభించి మరీ పుస్తకాన్ని అచ్చు వేయించాడు.

ఇద్దరు మిత్రుల సహకారం

తాను గీసిన బొమ్మలను ఇద్దరు స్నేహితుల సహకారంతో ఫొటోషాప్‌, డిజైన్‌ చేయించేవాడు ఆదిత్య. అలాగనీ.. చదువుపైన శ్రద్ధ పెట్టడం లేదనుకోకండి.. రోజుకు గంట మాత్రమే బొమ్మలు గీస్తాడట మన ఆదిత్య. మిగతా సమయంలో చదువుకుంటాడట. అయితే, చదివించే బాధ్యత వాళ్ల అమ్మది, బొమ్మలు గీయించేది మాత్రం నాన్న అట. అలా పనిని విభజించుకున్నారా తల్లిదండ్రులు. ఇప్పటివరకూ ఈ బాలుడు రాసిన 7 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. అప్పటివరకూ ఫొటోషాప్‌ అంటే తెలియని వాళ్ల నాన్న.. ఆదిత్య కోసమే యూట్యూబ్‌లో పాఠాలు విని నేర్చుకున్నాడట. కేవలం పుస్తకాలు, పరీక్షలు, మార్కులే కాకుండా పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకొని ప్రోత్సహించాలని చెబుతున్నాడాయన. ఆదిత్య అద్భుత ప్రతిభ ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ నమోదైందట. నిజంగా ఈ నేస్తం గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని