Published : 22 Feb 2022 01:04 IST

బాలుడి యోగా.. ‘గిన్నిస్‌’లో చేరిందిగా!

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఏదైనా పోటీలోనో చదువులోనో చిన్న బహుమతి వస్తేనే ఎంతో సంబరపడిపోతాం కదా! ఇక అవార్డులో రివార్డులో వస్తే.. గాల్లో తేలిపోతాం. అయితే, ఓ నేస్తం మాత్రం అతి చిన్న వయసులోనే గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించి ఔరా అనిపించాడు. ఇంతకీ అతడెవరో, ఎందులో అవార్డు సాధించాడో చదివేయండి మరి!

భారత్‌కు చెందిన తొమ్మిదేళ్ల రేయాన్ష్‌ సురాని కుటుంబం ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఇంట్లో తల్లిదండ్రులు రోజూ ఉదయాన్నే యోగా చేస్తుంటే.. రేయాన్ష్‌ కూడా వారితోపాటే సాధన చేసేవాడు. అలా నాలుగేళ్ల వయసులోనే అతడికి యోగాతో పరిచయం ఏర్పడింది. తరవాత అతడి తల్లిదండ్రులు రిషికేష్‌లోని ఓ యోగా శిక్షణ శిబిరంలో చేరారు. ఆసక్తి మేరకు ఈ బుడతడు కూడా వారితోపాటు అక్కడే చేరాడు. అలా కొద్దిరోజుల్లోనే యోగాపైన ఆసక్తి కాస్త ఇష్టంగా మారింది. 

కోర్సు పూర్తి చేసి మరీ..

బుడి బుడి అడుగుల వయసులోనే యోగా సాధనను ప్రారంభించిన రేయాన్ష్‌.. గత జులైలో ఓ శిక్షణ కేంద్రం నుంచి 200 గంటల యోగా ట్రైనింగ్‌ కోర్సును విజయవంతంగా పూర్తి చేశాడు. అందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ఇటీవల అతడు అందుకోగానే.. తల్లిదండ్రులు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులను సంప్రదించారు. వారు బాలుడి ప్రతిభను గుర్తించి అతి చిన్న వయసు యోగా గురువుగా గుర్తిస్తూ ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం కల్పించారు.

బోలెడు నేర్చుకున్నాడట

కోర్సు సమయంలో ఈ చిన్నోడు యోగాకు సంబంధించిన అనేక మెలకువలు నేర్చుకున్నాడట. మొదట్లో యోగా అంటే.. వివిధ భంగిమలు, శ్వాసపై నియంత్రణ అని మాత్రమే అనుకున్న రేయాన్ష్‌.. రిషికేష్‌లో శిక్షణకు వెళ్లాక ఇంకా చాలా ఉందని తెలుసుకున్నాడు. ఆసనాల కోసం ఎంతో సాధన చేసేవాడట.

తానే నేర్పిస్తున్నాడట

యోగాలో అద్భుత ప్రతిభ చూపుతున్న ఈ బాలుడు, ప్రస్తుతం కొందరికి శిక్షణ కూడా ఇస్తున్నాడట. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ నేర్పిస్తున్నానీ, ప్రతి బ్యాచ్‌లో 10 నుంచి 15 మంది ఉండేలా చూసుకుంటానని చెబుతున్నాడు. కరోనా పూర్తిగా తగ్గాక.. మరింత మందికి నేర్పిస్తానంటున్నాడు. తల్లిదండ్రులను చూసి, ఏదో సరదాగా చేసిన యోగానే అతడిని గొప్పవాడిని చేసింది మరి. ఇంత చిన్న వయసులోనే గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించడమంటే మాటలు కాదు కదా.. అందుకే, మనందరమూ రేయాన్ష్‌కి అభినందనలు చెప్పేద్దాం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని