Published : 25 Feb 2022 00:51 IST

బ్యాడ్మింటన్‌లో ‘సిరి’!

హాయ్‌ నేస్తాలూ.. ఎవరికైనా నాన్నే తొలి హీరో కదా! ఓ నేస్తం కూడా చిన్నతనం నుంచి నాన్నను చూసి సరదాగా నేర్చుకున్న ఆటే.. ఇప్పుడు తనకు బోలెడు పేరు తీసుకొచ్చింది. అంతేకాదు.. ఒక్కో పతకం సాధిస్తూ.. త్వరలోనే తన ప్రతిభను రాష్ట్రస్థాయిలో నిరూపించబోతోంది.. ఇంతకీ ‘ఎవరా నేస్తం?’, ‘ఏంటా ఆటా?’ చదివేయండి మరి!  

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సిరిహాసినికి 13 ఏళ్లు. అమ్మ సునీత, నాన్న సురేష్‌ కుమార్‌. ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. నాన్నకు బ్యాడ్మింటన్‌ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆయన ఆట చూస్తుండటంతో సిరికీ ఆసక్తి ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే అది కాస్త ఇష్టంగా మారింది. కూతురు బాగా ఆడుతుండటంతో స్థానికంగా ఓ అకాడమీలో చేర్పించారు నాన్న. శిక్షకుడు కాశీవిశ్వనాథ్‌ దగ్గర మెలకువలు నేర్చుకుంటూ.. ఆటలో నైపుణ్యం సాధించిందీ చిన్నారి.  

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

అమలాపురం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే జిల్లాస్థాయి షటిల్‌ పోటీల్లో మూడుసార్లు బంగారు పతకం సాధించింది సిరి. కాకినాడలో జరిగిన అండర్‌-10, మలికిపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లోనూ విజయం సాధించింది. ఇటీవల కాకినాడ జిల్లా స్పోర్ట్స్‌ అకాడమీలో నిర్వహించిన అండర్‌-17 జిల్లా స్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో శ్రీకాకుళంలో ఈ నెలాఖరున జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.  

సమన్వయం.. సమన్యాయం!

‘బ్యాడ్మింటన్‌లో ఇన్ని విజయాలు సాధిస్తుంది సరే, మరి చదువో?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. ఒకవైపు ఆడుతూనే చదువుపైనా శ్రద్ధ చూపుతోంది సిరి. ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి గంటపాటు చదువుతుంది. 6 గంటల నుంచి 7.30 గంటల వరకూ, సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత మళ్లీ రెండు గంటలు ఆట సాధన చేస్తుంది. ఆ తర్వాత మళ్లీ చదువుకోవడమే. అంటే, ఓ ప్రణాళిక ప్రకారం చదువుతోపాటు ఆటనూ సమన్వయం చేసుకుంటుందన్నమాట. ‘రోజూ ప్రాక్టీస్‌ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతోంది. అది చదువు విషయంలోనూ ఉపయోగపడుతోంది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సాత్విక్‌ నాకు స్ఫూర్తి. ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం సాధించాలన్నది నాన్న కోరిక.. నా లక్ష్యం కూడానూ..’ అని చెబుతోంది సిరిహాసిని. చిన్నవయసులోనే పెద్ద లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని