Published : 27 Feb 2022 00:48 IST

శెభాష్‌.. రీనా!

ఓ బుడత తన నిజాయతీని చాటుకుంది. చిన్న వయసులోనే చక్కటి విలువలు తన సొంతం చేసుకుంది. అందరూ తనను చూసి చప్పట్లు చరిచేంత ఉన్నత వ్యక్తిత్వం తనకుందని నిరూపించుకుంది. నగదు బహుమతులూ గెలుచుకుంది. పాఠశాలలోనూ సన్మానాలు, సత్కారాలు పొందింది. తనను కన్న తల్లిదండ్రులకు, తాను చదువుకుంటున్న బడికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఇంతకీ తను ఏం చేసిందో తెలుసా!

మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌ జిల్లా కకరువా గ్రామానికి చెందిన రీనా ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. ఇటీవల తాను నడుచుకుంటూ వెళుతుంటే.. తనకు రోడ్డు మీద ఓ పెద్ద పర్స్‌ దొరికింది. అందులో చాలా నగలున్నాయి. దాని యజమానులు ఎవరైనా వస్తారేమో అనుకుని తను చాలాసేపు అక్కడే ఎదురు చూసింది. కానీ ఎవరూ రాలేదు. ఇక ప్రయోజనం లేదనుకుని ఆ పర్స్‌ను తనతోపాటు ఇంటికి తీసుకెళ్లింది.

నాన్న సాయంతో...
రీనా వాళ్ల నాన్న కూలీ. ఆయన పేరు మంగళ్‌సింగ్‌. ఈ పర్స్‌ను తీసుకెళ్లి వాళ్ల నాన్న చేతిలో పెట్టి విషయం చెప్పింది. తర్వాత రీనా నేరుగా పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి విషయం అంతా వివరించింది. పోలీసుల విచారణలో ఆ పర్స్‌ యశపాల్‌సింగ్‌ పటేల్‌ వాళ్ల కూతురిదని, ఆ నగల విలువ సుమారు ఏడు లక్షల రూపాయలని తేలింది. బైక్‌ మీద వెళుతుండగా ఆ పర్స్‌ జారిపడిపోయింది. అది మన రీనాకు దొరికింది. కఠిక పేదరికంలో ఉన్నా... అంత విలువైన నగలు దొరికితే, పోలీసులకు వాటిని అప్పజెప్పి తన నిజాయతీ చాటుకుంది.

వరించిన బహుమతులు
తమ నగలను నిజాయతీగా అప్పగించినందుకు యశ్‌పాల్‌సింగ్‌ పటేల్‌ చాలా ఆనందపడ్డాడు. ఎంతో ఆనందంతో చిన్నారి రీనాకు 51,000 రూపాయలను బహుమతిగా ఇచ్చాడు. ఇంకా.. చక్కని దుస్తులనూ కొనిచ్చాడు. ఉదయ్‌పుర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇంఛార్జి కూడా రీనా నిజాయతీని మెచ్చుకుంటూ 1,100 రూపాయలను బహుమతిగా అందించాడు.

బడిలోనూ సత్కారం
తాను చదువుకునే బడిలోనూ రీనాను సత్కరించారు. ఆ నగలకన్నా రీనా నిజాయతీ ఇంకా విలువైందని పొగిడారు. చిన్నారిని చక్కగా పెంచి, విలువలు బోధించిన తల్లిదండ్రులనూ మెచ్చుకున్నారు. రీనా వల్ల తమ పాఠశాలకూ మంచి పేరు వచ్చిందని ఉపాధ్యాయులు మురిసిపోతున్నారు. నిజంగా మన రీనా గ్రేట్‌ కదూ. మనకు కూడా ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏమైనా దొరికితే ఇలాగే నిజాయతీగా వాటిని పోలీసులకు అప్పగిద్దామా ఫ్రెండ్స్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు