బుజ్జి బుడత.. రాతలో ఘనత!

మనం అయిదేళ్ల వయసప్పుడు ఏం చేస్తాం. ఇంకేం చేస్తాం.. స్కూలుకు పోతాం.స్కూలు నుంచి ఇంటికి వచ్చాక హోం వర్క్‌ చేస్తాం. కాసేపు ఆడుకుంటాం. ఇంకాసేపు టీవీలో కార్టూన్లు చూస్తాం. కానీ ఓ బుజ్జి బుడత ఇవన్నీ చేస్తూనే... ఏకంగా ఓ

Updated : 28 Feb 2022 06:26 IST

మనం అయిదేళ్ల వయసప్పుడు ఏం చేస్తాం. ఇంకేం చేస్తాం.. స్కూలుకు పోతాం.స్కూలు నుంచి ఇంటికి వచ్చాక హోం వర్క్‌ చేస్తాం. కాసేపు ఆడుకుంటాం. ఇంకాసేపు టీవీలో కార్టూన్లు చూస్తాం. కానీ ఓ బుజ్జి బుడత ఇవన్నీ చేస్తూనే... ఏకంగా ఓ పుస్తకమే రాసింది. ఒక్క రాయడం ఏంటి... ఏకంగా పబ్లిష్‌ కూడా అయితేనూ!

బుడత పేరు బెల్లా జే డార్క్‌. ఇంగ్లాండ్‌లోని వేమౌత్‌ పట్టణంలో నివసిస్తోంది. తను గత సంవత్సరం మాటల్లో మాటగా తన తల్లిదండ్రులకు ఓ విషయం చెప్పింది. అదేంటంటే... ‘మమ్మీ, డాడీ.. నేను ఓ పుస్తకం రాయాలనుకుంటున్నాను’ అని! అది విన్న వెంటనే వాళ్లు ముందు నవ్వుకున్నారు. సరదాగా అంటుందేమోలే అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ మన బుడత బెల్లా జే డార్క్‌ అనుకున్నంత పనీ చేసేసింది. ఎంచక్కా పుస్తకం రాసేసింది. కేవలం రాయడం ఏంటి? ఏకంగా బొమ్మలు కూడా గీసేసింది. ఆ పుస్తకం పబ్లిష్‌ అయింది కూడా!

గిన్నీస్‌ ముంగిట...

బెల్లా జే డార్క్‌ రాసిన పుస్తకానికి ‘ది లాస్ట్‌ క్యాట్‌’ అని పేరు పెట్టుకుంది. ఈ పుస్తక ప్రతులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కనుక వెయ్యి కాపీలు అమ్ముడుపోతే ‘ప్రపంచంలోకెల్లా అత్యంత పిన్న వయస్కురాలైన రచయిత’గా బెల్లా జే డార్క్‌ పేరు ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో నమోదవుతుంది. ప్రస్తుతం ఆ రికార్డు ఎవరి పేరు మీద ఉందో తెలుసా..? మన భారత దేశానికి చెందిన అభిజితా గుప్తా పేరు మీద. తను ఏడేళ్ల వయసున్నప్పుడు పుస్తకాన్ని రాసింది. మొత్తానికి మన బెల్లా జే డార్క్‌ ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌  రికార్డ్స్‌’లో తన పేరు నమోదు కావడానికి ఉవ్విళ్లూరుతోంది. ఎప్పుడెప్పుడు ‘ది లాస్ట్‌ క్యాట్‌’ పుస్తకం వెయ్యి కాపీలు అమ్ముడవుతాయా? అని ఎదురుచూస్తోంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా.. మరో పుస్తకం రాయడానికి కూడా కసరత్తులు చేస్తోంది. ఎంతైనా ఈ బుజ్జాయి చాలా గ్రేట్‌ కదూ!

ఏంటీ.. మీరూ కాగితం, కలం పట్టారా? మీరూ మీ చిట్టిపొట్టి చేతులతో ఓ పుస్తకం రాసేస్తారా! మంచి విషయమే.. ఇంకెందుకాలస్యం రాసేయండి మరి. ఏ పుట్టలో ఏ పాముందో... ఏ బుజ్జాయిలో ఏ రచయిత దాగున్నాడో ఎవరికి తెలుసు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని