Published : 02 Mar 2022 01:30 IST

శెభాష్‌ అన్లినా!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా పరీక్షలో లేఖ రాయమని ప్రశ్న అడిగితే దిక్కులు చూస్తాం. ఇంట్లో వాళ్లు బంధువులకు ఉత్తరం రాయమంటే, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాం. కానీ, ఓ చిన్నారి మాత్రం ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. అదీ ఒక సమస్యపైన. ఇంతకీ ఆ బాలిక ఎవరో, లేఖలోని వివరాలేంటో తెలుసుకుందామా మరి!

న్లినా అజూది కేరళ రాష్ట్రంలోని ఈరూరు. తండ్రి నౌకాదళ ఉద్యోగి. ఆమె ఇంటికి సమీపం నుంచే కనియప్పుజ అనే నది ప్రవహిస్తుంది. ఈ నది వెంట ఉన్న బాట మీదుగానే ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న ఆ చిన్నారి రోజూ బడికి వెళ్లి వస్తుంటుంది. అలా నదితో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఒకసారి ఆ చిన్నారి పుట్టినరోజుకు తాతయ్య కెమెరా కొనివ్వడంతో.. ఆ అనుబంధం ఇంకాస్త పెరిగింది. బడికి రాకపోకలు సాగించే క్రమంలో నదీ, ఆ నీటిపై వాలే పిట్టలూ, సీతాకోకచిలుకలూ, ఇతర జీవుల ఫొటోలు తీసుకొనేది ఆ చిన్నారి.

పక్షుల సంఖ్య తగ్గిపోవడంతో..

ఒకసారి తాను రోజూ చూసే నదిలో క్రమక్రమంగా చెత్త పెరిగిపోవడం గమనించింది అన్లినా. నది పరిసరాలు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో పాటు.. నీరు కలుషితం అవుతుండటంతో రోజూ వచ్చే పక్షుల సంఖ్య కూడా తగ్గిపోయింది. దాంతో చిన్నారికి బాధ కలిగింది. వెంటనే, సమస్యను వివరిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాసింది. అంతేకాదండోయ్‌.. నది కలుషితం కాకముందు, ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ఫొటోలనూ లేఖకు జతచేసి పంపించిందా చిన్నారి.  

కలెక్టర్‌ ఇంటికొచ్చి మరీ..

ఆ లేఖను చదివిన ముఖ్యమంత్రి, సంబంధిత జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. వెంటనే సమస్యను పరిశీలించాలని ఆదేశించారు. దాంతో మరుసటి రోజే బాలిక ఇంటికి వెళ్లిన కలెక్టర్‌కు.. నదిలో చెత్త వేయడంతో పొంచి ఉన్న ముప్పును ఫొటోలతో సహా ఆయనకు వివరించింది అన్లినా. ఆయన వెంటనే స్పందించి.. చెత్తను ఎవరు వేస్తున్నారో.. ఏ ప్రాంతంలో సమస్య ఎక్కువగా ఉందో గుర్తించి.. పరిష్కారానికి చర్యలు చేపట్టడంతోపాటు తనకు ఓ నివేదిక కూడా ఇవ్వాలని స్థానిక అధికారులకు సూచించారు. పాఠశాలలూ, కళాశాలల విద్యార్థులతో కలిసి నది తీరంలో ఉన్న ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలూ నిర్వహిస్తామని ఆ చిన్నారికి భరోసా ఇచ్చారు కలెక్టర్‌. చిన్న వయసులోనే సామాజిక స్పృహ కలిగి ఉండటంతోపాటు ధైర్యంగా సీఎంకు లేఖ రాయడంపైన చిన్నారిని అభినందించారు కలెక్టర్‌. అలాగని, అన్లినాకు ప్రశంసలు కొత్తేమీ కాదు.. 2020లోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందించే ‘ఉజ్వల బాల్యం అవార్డు’ అందుకుంది. చూశారా ఫ్రెండ్స్‌.. మనకెందుకులే అని అనుకోకుండా.. ప్రశ్నించేతత్వమే ఇప్పుడీ నేస్తాన్ని అందరూ శెభాష్‌ అనేలా చేస్తోంది మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని