Published : 03 Mar 2022 01:31 IST

అక్కాచెల్లెళ్ల ఆలోచన భేష్‌!

హాయ్‌ పిల్లలూ.. స్నేహితులో బంధువులో కష్టాల్లో ఉంటే మనకు చేతనైన సహాయం చేస్తుంటాం. అదే, ‘మన కుటుంబమే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే?’ - గుండె తల్లడిల్లిపోతుంది కదా! మనమూ ఏదో ఒక పని చేసి.. అమ్మానాన్నలకు అండగా నిలవాలని అనుకుంటాం. అలాగే, ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా వాళ్ల కుటుంబానికి మేమున్నామనే భరోసా ఇస్తున్నారు. ఆ వివరాలేంటో చదివేయండి మరి!

రిప్రియ, శివప్రియ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. కేరళ రాష్ట్రంలో అత్తింగల్‌ అనే ఒక చిన్న పల్లెటూరు వారిది. ప్రస్తుతం తొమ్మిది, పదకొండో తరగతి చదువుతున్నారు. వారిద్దరూ గత అయిదేళ్లుగా కొంత భూమిలో కూరగాయలు పండిస్తూ.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.

ఇంటి పెరట్లో ప్రారంభమై..

ఈ అక్కాచెల్లెళ్లది పేద కుటుంబం. కరోనా పరిస్థితులతో వాళ్ల కుటుంబం ఆర్థికంగా ఇంకా దెబ్బతింది. తండ్రి రోజువారీ కూలీ కావడంతో పూట గడవడమే కష్టంగా మారిందట. దాంతో ఈ అక్కాచెల్లెళ్లు కూడా ఇంటి కోసం ఏదో ఒక పని చేయాలనుకున్నారు. మొదట్లో తండ్రి పని ప్రదేశం నుంచి బస్తాలు తీసుకొస్తే.. వాటిల్లో వంటింటి వ్యర్థాలు, మట్టి తదితరాలు నింపి ఎరువులా తయారు చేశారు. అందులో కొన్ని విత్తనాలు నాటారు. ఇంటి పెరట్లోనే రకరకాల మొక్కలు పండిస్తుండటంతో వారి పట్టుదల.. పక్కనే ఉండే ఇంటి పెద్దాయనకు నచ్చింది. దాంతో ఆయన తన సొంత భూమి కొంత చూపించి, అందులో వ్యవసాయం చేసుకోమని చెప్పాడట.

సాగే.. ఇంటికి ఆధారమైంది

కాస్త భూమి సమకూరడంతో ఆ అక్కాచెల్లెళ్లు సొంతంగానే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా, సహజ పద్ధతుల్లో రకరకాల కూరగాయలతో పాటు ఆకుకూరలూ సాగు చేయడం ప్రారంభించారు. అలాగని.. చదువును పక్కనబెట్టేయలేదు. ఒకవైపు తరగతులకు హాజరవుతూనే, సాగు పనీ చేస్తున్నారు. ఊరివాళ్లు కొందరు ప్రతి రోజూ తోట దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తుంటారట. మిగిలిన వాటిని వాళ్ల నాన్న మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తారట. ‘ఎలాగైనా ఇంటికి అండగా నిలవాలని ప్రారంభించిన సాగే.. ఇప్పుడు మా కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా మారింది’ అని సంతోషంగా చెబుతున్నారీ అక్కాచెల్లెళ్లు. తక్కువ విస్తీర్ణంలోనే పంట పండిస్తున్న వీరి కృషికి గుర్తింపుగా పంచాయతీ యంత్రాంగం అవార్డూ అందించిందట. చిన్న వయసులోనే పెద్ద ఆలోచన చేసిన వీళ్లు నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు