Published : 04 Mar 2022 00:52 IST

వయసు మూడేళ్లు.. టకటకా పేర్లు

హాయ్‌ పిల్లలూ.. ఇంట్లో మనం తక్కువగా వెళ్లే గది ఏదైనా ఉందీ అంటే అది వంటిల్లే అయి ఉంటుంది! ఆ గదిలోకి వెళ్లేదే అరుదు అంటే ఇంక వంటకు ఉపయోగించే పదార్థాల పేర్లు తెలిసే అవకాశమే లేదు. కానీ, ఓ మూడేళ్ల బాబు మాత్రం అలా కాదు. వంటింటి సామగ్రి పేర్లను గడగడా చెప్పేస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు.
మహారాష్ట్రలోని ముంబయికి చెందిన అబిర్‌కు మూడేళ్లు. ఇటీవల ఆ బాబును వాళ్ల అమ్మ సోనికా భాసిన్‌ దగ్గరిలోని ఓ సూపర్‌ మార్కెట్‌కి తీసుకెళ్లింది. అక్కడ అతడు వంటకు వినియోగించే పోపు దినుసులు, మసాలాల పేర్లను ఏమాత్రం తడుముకోకుండా టకటకా చెప్పేశాడు. అంతేకాదు.. పెద్దవాళ్లు సైతం ఒక్క క్షణం పాటు ఆలోచించే పప్పులనూ.. సరిగ్గా గుర్తించడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారట. బిర్యానీ ఆకులూ, యాలకులూ, కందిపప్పూ, శనగపప్పూ.. ఇలా వంట పదార్థాల పేర్లను గడగడా చెబుతున్న బాబు వీడియోను వాళ్ల అమ్మ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. కొద్దిసేపట్లోనే విపరీతమైన లైకులు, అతడి ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్లూ రావడంతో.. ఆ చిన్నోడు చిన్నపాటి సెలెబ్రిటీ అయిపోయాడు మరి! ఇవే కాకుండా ఈ బాబు, పప్పీని రోజూ వాకింగ్‌కి తీసుకెళ్తాడట. ఇంటి వరండాలోని కుండీల్లో సొంతంగా మొక్కలూ పెంచుతున్నాడట. స్పష్టంగా మాటలే రాని.. ఈ బుడిబుడి అడుగుల వయసులోనే చిన్నోడి జ్ఞాపకశక్తి నిజంగా గ్రేట్‌ కదూ!


బుల్లి పోలీసు.. నాలుగేళ్లకే ఉద్యోగం!  

పిల్లలూ.. ‘నాలుగేళ్ల వయసులో ఏం చేస్తాం?’ - ప్లేస్కూల్లో ఆడుకుంటూనో లేదంటే యూకేజీనో ఎల్‌కేజీనో చదువుకుంటూ ఉంటాం. అంతే కదా! కానీ, ఓ చిన్నోడు మాత్రం ఏకంగా బుల్లి పోలీసు అయిపోయాడు. అదెలాగో చదివేయండి మరి..

మధ్యప్రదేశ్‌లోని కట్నీ ప్రాంతానికి చెందిన గజేంద్ర అనే బాలుడికి కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. ‘అదేంటి, కనీసం ఇంటర్‌ కూడా పూర్తి చేయకుండా ఎలా ఇచ్చారు?’ అని అలా సందేహంగా చూడకండి. మన గజేంద్ర వాళ్ల నాన్న శ్యాంసింగ్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కొద్ది రోజుల క్రితమే చనిపోయారట. దాంతో నిబంధనల మేరకు మానవీయ కోణంలో ఆలోచించిన ఉన్నతాధికారులు.. గజేంద్రకు ‘బాల రక్షక్‌’గా ఉద్యోగం ఇచ్చారట. వివిధ అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించడంతోపాటు పోలీసు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. అలాగనీ, బడి మానేయనక్కర్లేదు ఫ్రెండ్స్‌. ఎంచక్కా స్కూల్‌కి వెళ్లి చదువుకోవచ్చు. ఈ చిన్నోడికి 18 ఏళ్లు వచ్చేవరకూ సగం జీతం కూడా చెల్లించనున్నారట. పోలీసు విధులు, పనితీరుపైన అవగాహన కోసం ఈ ‘చైల్డ్‌ కానిస్టేబుల్‌’ వారానికోసారో, నెలకు రెండుసార్లో స్టేషన్‌కు వెళ్లివస్తే సరిపోతుందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు