పుట్టిన రోజు.. చిన్నారికి సర్‌ప్రైజు!

హాయ్‌ నేస్తాలూ.. మన పుట్టినరోజు వస్తుందంటేనే బోలెడు సంబరపడిపోతుంటాం. ఏ కేక్‌ తెచ్చుకోవాలో, ఎవరెవర్ని పిలవాలో, వారికి ఏమేం ఇవ్వాలోనని అమ్మానాన్నలతో కలిసి తెగ ఆలోచిస్తుంటాం.

Published : 12 Mar 2022 00:15 IST

హాయ్‌ నేస్తాలూ.. మన పుట్టినరోజు వస్తుందంటేనే బోలెడు సంబరపడిపోతుంటాం. ఏ కేక్‌ తెచ్చుకోవాలో, ఎవరెవర్ని పిలవాలో, వారికి ఏమేం ఇవ్వాలోనని అమ్మానాన్నలతో కలిసి తెగ ఆలోచిస్తుంటాం. కానీ, అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా ఫ్రెండ్స్‌. ఓ చిన్నారి బర్త్‌డే కూడా అనుకోని పరిస్థితుల్లోనే జరిగింది. ఇంతకీ ఆ వివరాలేంటో చదివేయండి మరి!

ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న విషయాన్ని పత్రికల్లోనో, టీవీల్లోనో చూసే ఉంటారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌ ప్రజలు సరిహద్దు దేశాలకు వలస వెళ్తున్నారు. ఆ దేశాల ప్రజలూ, ప్రభుత్వాలూ ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన శరణార్థుల కోసం తాత్కాలిక వసతితో పాటు ఆహారం కూడా అందిస్తున్నాయి. అలాగే, ఏడేళ్ల అరీనా కూడా తన కుటుంబంతో కలిసి రొమేనియాలోని సహాయ శిబిరంలో తలదాచుకుంటోంది.

బొమ్మలూ, బెలూన్లతో..

అరీనా పుట్టిన రోజు అని తెలుసుకున్న అక్కడి వలంటీర్లు చిన్నారిని సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నారు. వెంటనే, కొన్ని బొమ్మలతో పాటు బెలూన్లూ తీసుకొచ్చి.. ఆ పాపకు బహుమతిగా అందించారు. అంతేకాదు.. ‘హ్యాపీ బర్త్‌డే టు యూ’ అంటూ పుట్టినరోజు పాట కూడా పాడారట. అయితే, అప్పటివరకూ ఏటా మాదిరి ఈసారి సెలబ్రేట్‌ చేసుకోలేకపోతున్నానని బాధ పడిన ఆ చిన్నారి.. వలంటీర్ల గిఫ్టులతో ఆశ్చర్యపోయిందట.

వైరల్‌ కావడంతో..

చిన్నారి పుట్టినరోజు వేడుకల వీడియోను కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో కొద్దిక్షణాల్లోనే వైరల్‌గా మారింది. వలంటీర్ల మానవత్వాన్ని అభినందిస్తూ కొందరూ, పాపకు శుభాకాంక్షలు చెబుతూ మరికొందరూ, ఈ పుట్టినరోజు ఆ చిన్నారికి ఎప్పటికీ గుర్తుంటుందంటూ ఇంకొందరూ కామెంట్లు పెడతున్నారు. ఆలస్యంగానైనా.. మనమూ అరీనాకు ‘హ్యాపీ బర్త్‌డే’ చెప్పేద్దాం మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని