Published : 19 Mar 2022 00:38 IST

కామిక్‌ పాత్రలు గుర్తించి.. రికార్డు సాధించి.!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. కామిక్‌ పుస్తకాలన్నా, సినిమాలన్నా కళ్లప్పగించి మరీ చదువుతాం.. చూస్తాం కదా! ఇక అందులోని పాత్రల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఆయా సిరీస్‌ల్లో వివిధ సాహసాలు చేసే హీరో పాత్రల్లో మనల్ని మనం ఊహించేసుకుంటాం. అలాంటి కామిక్‌ పాత్రల్లో అయిదో ఆరో మహా అయితే ఒక పది వరకూ గుర్తుపట్టగలం. కానీ, ఓ బుడతడు మాత్రం అత్యధిక కామిక్‌ పాత్రలను గుర్తించి ఏకంగా రికార్డు కొట్టేశాడు మరి. ఆ వివరాలే ఇవి..

మిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి చెందిన నిధిశ్‌కు ఏడేళ్లు. రెండో తరగతి చదువుతున్న ఈ బాలుడు ఇటీవల ‘గిన్నిస్‌ బుక్‌ రికార్డు’ల్లోకి ఎక్కేశాడు. ఇంతకీ ఏం సాధించాడంటే - డీసీ కామిక్స్‌ పుస్తకంలోని 60 పాత్రల పేర్లను కేవలం 60 సెకన్లలో గడగడా చెప్పేశాడు. గతంలో 52 పాత్రలను గుర్తించిన రికార్డును ఈ చిన్నోడు బద్దలుగొట్టాడన్నమాట.

నెల రోజుల్లోనే..

మనలాగే నిధిశ్‌ కూడా కార్టూన్‌ ఛానళ్లు ఎక్కువగా చూస్తుంటాడట. అంతేకాదు.. అందులోని పాత్రల బొమ్మలను సేకరించి మరీ ఇంట్లో గోడలకు అతికించేవాడట. ఆ ఆసక్తిని గమనించిన వాళ్ల అమ్మ.. ‘రికార్డు కోసం ఎందుకు ప్రయత్నించకూడదు?’ అని అనుకుంది. వెంటనే, మన నిధిశ్‌ను ఓ శిక్షణ సంస్థలో చేర్పించింది. కేవలం నెల రోజుల సాధనతోనే ఇటీవల చెన్నైలో నిర్వహించిన ప్రదర్శనలో నిమిషం వ్యవధిలోనే సూపర్‌మ్యాన్‌, బ్యాట్‌మన్‌, జోకర్‌, వండర్‌ ఉమెన్‌, ఫ్లాష్‌ తదితర 60 పాత్రలను గుర్తించాడట. చిన్నోడి ప్రతిభకు ఆశ్చర్యపోయిన గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు రికార్డు నమోదు చేసి.. సర్టిఫికెట్‌ కూడా అందజేశారు.

సీరియళ్లలో నటిస్తూ..

ఈ నేస్తానికి బోలెడు జ్ఞాపకశక్తితో పాటు నటన కూడా తెలుసండోయ్‌. తన చదువుకు ఇబ్బంది కాకుండా.. తమిళ టీవీ సీరియళ్లలో నటిస్తుంటాడు. వాళ్ల అమ్మ నృత్య కళాకారిణి కావడంతో.. నిధిశ్‌ను నాలుగేళ్లకే బుల్లితెరకు పరిచయం చేశారామె. సామాజిక మాధ్యమాల్లోనూ ఇతడికి భలే క్రేజ్‌ ఉంది. రీల్స్‌, రకరకాల వీడియోలతో ఇన్‌స్టాలో సందడి చేస్తుంటాడు. గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కడంతో సన్మానాలూ, ఇంటర్వ్యూలంటూ ప్రస్తుతం యమా బిజీగా ఉన్నాడీ బుడతడు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు